Telangana Thalli Statues: 10 అడుగుల ఎత్తుతో ‘తెలంగాణ తల్లి’
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:42 AM
రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాల ఎత్తు, ధర ఖరారయ్యాయి. ఈ విగ్రహాల తయారీకి ఆర్‌అండ్‌బీ టెండర్లను ఆహ్వానించింది.
ఒక్కో విగ్రహానికి 17.5 లక్షల ఖర్చు.. టెండర్లు పిలిచిన సర్కారు
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాల ఎత్తు, ధర ఖరారయ్యాయి. ఈ విగ్రహాల తయారీకి ఆర్‌అండ్‌బీ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలోనే అన్ని జిల్లాల కలెక్టరేట్లలోనూ విగ్రహాలను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్లలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాల ఎత్తును 10 అడుగులుగా ఖరారు చేశారు.
అలాగే బేస్‌మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే ఉక్కు పిడికిళ్ల పీఠం 2 అడుగులు ఉండనుంది. ఇవన్నీ కలిపి మొత్తం 16 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంటుంది. ఒక్కో విగ్రహ ఏర్పాటుకు రూ.17.5 లక్షల వరకు ఖర్చు కానుంది. అంటే 33 జిల్లాలకు కలిపి రూ.5.77 కోట్లు ఖర్చవనుంది. డిసెంబరు 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.