Damodara Rajanarasimha: వైద్య సిబ్బందికి సెలవులు రద్దు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:30 AM
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.
3 రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఈ మూడు రోజుల పాటు ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వహించారు. ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆసుపత్రుల్లోనే ఉండాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
అందరికీ సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ అత్యవసరం ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, కరెంటు పోతే ఆ మరుక్షణమే జనరేటర్లను ప్రారంభించి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆసుపత్రుల లోపలికి నీరు చేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.