Share News

Green Auto Permits: ఓఆర్‌ఆర్‌ లోపల 65వేల ఆటోలకు అనుమతి

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:59 AM

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ జీవో ఆర్టీ నంబర్‌ 263 జారీ చేశారు.

 Green Auto Permits: ఓఆర్‌ఆర్‌ లోపల 65వేల ఆటోలకు అనుమతి

విద్యుత్‌, ఎల్పీజీ, సీఎన్‌జీ ఆటోలకు మాత్రమే

65వేల కుటుంబాలకు ఉపాధి: మంత్రి పొన్నం

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లోపల కొత్తగా 65 వేల ఆటోకు ప్రభుత్వం అనుమతించింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ జీవో ఆర్టీ నంబర్‌ 263 జారీ చేశారు. కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న నిబంధనల మేరకు హైదరాబాద్‌లో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇచ్చేందుకు వీలు లేదు. 2002 నుంచి ఈ నిబంధన అమలవుతుండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా 20వేల ఆటోలకు మాత్రమే పర్మిట్లు ఇచ్చింది. అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను సడలిస్తూ ఓఆర్‌ఆర్‌ లోపల పరిమిత సంఖ్యలో విద్యుత్‌, సీఎన్‌జీ, ఎల్పీజీ ఆటోలకు ప్రభుత్వం అనుమతించింది. 20 వేల విద్యుత్‌ ఆటోలు, 10వేల ఎల్పీజీ ఆటోలు, 10వేల సీఎన్‌జీ ఆటోలు, 25వేల డీజిల్‌, పెట్రోల్‌ ఇంజన్లతో ఉన్న (రెట్రో ఫిట్మెంట్‌ విధానంలో విద్యుత్‌, సీఎన్‌జీ, ఎల్పీజీగా మార్చేందుకు వీలైన) ఆటోలకు అనుమతులు ఇచ్చేందుకు సర్కారు ఓకే చెప్పింది. కాగా, ఓఆర్‌ఆర్‌ లోపల జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒక ప్రకటనలో వివరించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News

Updated Date - Jun 08 , 2025 | 04:59 AM