Swachh Bharat Funding: స్వచ్ఛభారత్ మిషన్‌కు 516.40 కోట్లు మంజూరు
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:18 AM
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌కు రూ.516.40 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నిర్మించనున్నారు
ఆమోదం తెలిపిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌కు రూ.516.40 కోట్లు మంజూరు చేసింది. సంబంధిత దస్త్రంపై మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఈ నిధుల్లో కేంద్ర వాటా 60 శాతం కాగా, రాష్ట్ర వాటా 40 శాతం ఉంటుంది. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పనులు చేపట్టేలా రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ ఏడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ నిధులతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించనుంది. రాష్ట్రంలో దాదాపు 1,90,166 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒక్కో నిర్మాణానికి రూ.12వేల చొప్పున రూ.228.19 కోట్లు వీటి కోసం కేటాయించింది. అంతేకాకుండా పర్యాటక, మతపరమైన ప్రదేశాలు, మార్కెట్ స్థలాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్‌స్టాండ్లు, మండల కేంద్రాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించనుంది ఒక్కో నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున మొత్తం 410 నిర్మాణాలకు రూ.12.30 కోట్లు ప్రభు త్వం కేటాయించింది.
మొట్టమొదటి సారిగా గ్రామాల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్‌కు రూ.64 లక్షల చొప్పున కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 యూనిట్లు నిర్మించేందుకు రూ.64 కోట్లు స్వచ్ఛభారత్ మిషన్ నిధులు విడుదల చేసింది. గ్రామాల్లో కంపోస్టు గుంతలు నిర్మించనుండగా, ఒక్కో యూనిట్‌కు రూ.1.50లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. వ్యక్తిగత ఇంకుడు గుంతల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.6,500 చొప్పున నిధులు కేటాయించింది. ఒక్కో దానికి రూ.92,747 చొప్పున మొత్తం 10,200 సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.