Future City: సీఎం చైర్మన్‌గా.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:07 AM
ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో ఉన్న ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఫ్యూచర్‌సిటీగా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

ఉపాధ్యక్షుడిగా మునిసిపల్ లేదా.. పరిశ్రమల మంత్రి
సభ్యులుగా సీఎస్, పలువురు ఉన్నతాధికారులు
హైదరాబాద్, మార్చి 12, (ఆంరఽధజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) మధ్యలో ఉన్న ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఫ్యూచర్‌సిటీగా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసే దిశలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ఈ మేరకు ఫ్యూచర్ సిటీ ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ(ఎ్‌ఫసీడీఏ)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడిగా మునిసిపల్ శాఖ లేదా పరిశ్రమల శాఖ మంత్రుల్లో ఒకరు వ్యవహరిస్తారు. సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికం, పరిశ్రమలు, ఐటీ శాఖల పత్యేక ప్రధాన కార్యదర్శులు, మునిసిపల్, పట్టణాభివృద్ది శాఖ, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) ఉంటారు.
సభ్య కార్యదర్శిగా ఎఫ్‌సీడీఏ సీఈవో వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు సెక్టార్లుగా విభజిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఓఆర్‌ఆర్‌కు లోపల ఉన్న ప్రాంతాన్ని ‘కోర్ తెలంగాణ’గా.. ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు రెండు కిలోమీటర్ల ఆవల వరకు ఉన్న ప్రాంతాన్ని ‘తెలంగాణ అర్బన్’గా, ఆ ప్రాంతానికి అవతల కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కాకుండా మిగిలిన అన్ని ప్రాంతాలను ‘రూరల్ తెలంగాణ’గా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉండే బఫర్‌జోన్ ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా ప్రకటించారు. ఈ భవిష్యత్ నగరం నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఏడు మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తీసుకురావాలని ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.