Share News

Uttam Kumar Reddy: ఫిలిప్పీన్స్‌కు 2 లక్షల టన్నుల బియ్యం

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:44 AM

తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌ దేశానికి ఇప్పటివరకు 30 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ ఏడాది మరో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

Uttam Kumar Reddy: ఫిలిప్పీన్స్‌కు 2 లక్షల టన్నుల బియ్యం

  • తెలంగాణ సోనాకు అక్కడ మంచి డిమాండ్‌

  • మన మొక్కజొన్నపైనా ఆసక్తి

  • ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రితో ఉత్తమ్‌ భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌ దేశానికి ఇప్పటివరకు 30 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ ఏడాది మరో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కోతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్‌- తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడారు. తెలంగాణలో పండించే ఆర్‌ఎన్‌ఆర్‌- 15048 (తెలంగాణ సోనా) రకం బియ్యానికి ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్‌ ఉందని, అందుకే ఎగుమతుల పరిధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.


ఈ చర్చల్లో కేవలం బియ్యమే కాకుండా, తెలంగాణలో పండే మొక్కజొన్న ఎగుమతిపైనా ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ఆసక్తి చూపించిందని తెలిపారు. బియ్యంతో పాటు మొక్కజొన్న ఎగుమతులు మొదలైతే ఫిలిప్పీన్స్‌తో వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ దేశానికి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉందని ఫ్రాన్సిస్కో చెప్పారని, భవిష్యత్తులో ఈ వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి వీలుంటుందని ఉత్తమ్‌ వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌ మంత్రిని తెలంగాణ పర్యటనకు ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 04:44 AM