Share News

Education Commission: నాణ్యమైన విద్య.. మిథ్యే

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:47 AM

ప్రభుత్వ పాఠశాలలపై భారీగా ఖర్చు చేస్తున్నా విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యా కమిషన్‌ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య.. మిథ్యగానే ఉందని స్పష్టం చేసింది.

Education Commission: నాణ్యమైన విద్య..  మిథ్యే

  • ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితులు దారుణం

  • 13,930 ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో 50 లోపే విద్యార్థులు

  • 4,235 ప్రభుత్వ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు

  • నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు’

  • మండలానికి మూడు చొప్పున ఏర్పాటు చేయాలి

  • నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ఫౌండేషనల్‌ స్కూళ్లు

  • మండలానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలి

  • 632 మండలాల్లో ఏర్పాటుకు రూ. 22,752 కోట్ల ఖర్చు

  • ప్రభుత్వ బడులకు మినీ బస్సుల సౌకర్యం కల్పించాలి

  • ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్‌ నివేదిక

హైదరాబాద్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలపై భారీగా ఖర్చు చేస్తున్నా విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యా కమిషన్‌ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య.. మిథ్యగానే ఉందని స్పష్టం చేసింది. నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతమున్న పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ (టీపీఎస్‌), పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి 2వ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషనల్‌ స్కూల్స్‌ (టీఎ్‌ఫఎస్‌) ఏర్పాటు చేయాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులు ఇటీవలే సీఎం రేవంత్‌ను కలిసి విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై కీలక సిఫారసులు చేశారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు ఈ సిఫారసులను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.


36 రాష్ట్రాల్లో 32వ స్థానం

ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యత దారుణంగా ఉండటంతో దీనిప్రభావం మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్‌ విద్యపైనా పడుతోందని విద్యా కమిషన్‌ తెలిపింది. రాష్ట్రం మొత్తంలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల్లో కేవలం 23ు మాత్రమే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్నారని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా, 13,930 (76ు) పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 50లోపు ఉంది. అలాగే 4235 (23ు) బడుల్లో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. మొత్తం 18,259 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 12,760 (70ు) బడుల్లో తరగతి గదులు 3 లోపే ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయస్థాయిలో 36 రాష్ట్రాల్లో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తెలిపింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలల్లో అందించే విద్యపై 99ు తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది.


నర్సరీ టు ఇంటర్‌ ‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌

‘తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌’ (టీపీఎస్‌) పేరుతో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలూ ఒకేచోట ఏర్పాటు చేయాలని కమిషన్‌ కీలక సిఫారసులు చేసింది. 1500 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున ప్రతీ మండలంలో 3 టీపీఎ్‌సలు ఏర్పాటు చేయాలని కోరింది. అన్ని వసతులతో ఒక టీపీఎస్‌ ఏర్పాటు చేయాలంటే రూ.12 కోట్లు అవసరం అవుతాయి. రాష్ట్రంలోని అన్ని 632 మండలాల్లో ఏర్పాటుకు ప్రభుత్వ రూ. 22,752 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ప్రత్యేకంగా తెలంగాణ ఫౌండేషనల్‌ స్కూల్స్‌ (టిఎ్‌ఫఎస్‌) ఏర్పాటు చేయాలని కమిషన్‌ సూచించింది. వీటిని మండలానికి 4 చొప్పున నెలకొల్పాలని సూచించింది. అన్ని వసతులతో ఒక ఫౌండేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే రూ. 3.5 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్రంలోని అన్ని 632 మండలాల్లో ఏర్పాటుకు రూ. 8,848 కోట్లు అవసరం అవుతాయని తెలంగాణ విద్యా కమిషన్‌ అంచనా వేసింది.


మినీ బస్సులతో యువతకు ఉపాధి

డ్రాపౌట్ల సంఖ్య అరికట్టేందుకు ప్రభుత్వ బడులకు ప్రత్యేకంగా మినీ బస్సులు నడపాలని, దీంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్తారని కమిషన్‌ సూచించింది. మినీ బస్సుల ఏర్పాటుకు స్థానిక యువతకు 50ు సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వాలని సూచించింది. దీంతో స్థానిక యువతకు ఉపాధి కూడా లభిస్తుందని సూచించింది. 632 మండలాల్లో మినీ బస్సుల పథకానికి ప్రభుత్వం దాదాపు రూ. 1,990 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కమిషన్‌ అంచనా వేసింది.

Updated Date - Mar 11 , 2025 | 04:47 AM