Telangana government: ఏడాదిలోనే రైతులకు 70 వేల కోట్లు
ABN , Publish Date - Jul 09 , 2025 | 04:17 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతులను పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ బురదజల్లే ప్రయత్నం: భట్టి
మంచి కారక్రమాలు చేస్తుంటే కడుపు మంటా?: పొంగులేటి
కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఏళ్లుంటే రాష్ట్రం సుభిక్షం: కోమటిరెడ్డి
తెలంగాణలా కావాలంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు: తుమ్మల
మహబూబాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన
మహబూబాబాద్/కేసముద్రం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతులను పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అన్నదాతల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మూడు నెలల కాలంలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ సర్కారుదని చెప్పారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించామన్నారు. రూ.12,500 కోట్లు ఖర్చుచేసి 51 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ సహాయక సంఘాల సభ్యులకు రూ.50 వేల కోట్ల రుణాలు అందించామన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. ఆ నియోజకవర్గంలోని సోమ్లాతండా, కేసముద్రంలలో రూ.400 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే అభివృద్ధి పనులకు పలువురు మంత్రలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై, కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పేదల పక్షపాతి మా ప్రభుత్వం: పొంగులేటి
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. హామీ ఇవ్వని పథకాలను సైతం ప్రవేశపెడుతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే వాటికి వడ్డీలు కడుతూనే కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నేతలు రంకెలు వేస్తూ సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పరిపాలన ఉండడంతో తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్లు అని ఊరించి ఎవరికీ ఇవ్వలేదని, తాము 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు.
రైతుల కళ్లలో సంతోషమే లక్ష్యం: కోమటిరెడ్డి
రైతుల కళ్లలో సంతోషం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వారి కోసం ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తూ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన శాఖ నుంచి కేసముద్రంలో రూ.175 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమలు రావాలంటే రోడ్లు రావాలని, మండలంలో వివిధ మార్గాలకు రాబోయే కాలంలో ప్రతీ రోడ్డును బీటీ రోడ్డుగా మారుస్తామని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ సంక్షేమ రాజ్యం: తుమ్మల
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రాజ్యం అని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఇలాంటి రాజ్యం కావాలంటూ ఇతర రాష్ట్రాల సీఎంలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. కొద్దిరోజుల్లోనే జిల్లాకు గోదావరి జలాలు తీసుకొస్తామని, ఆర్థిక భారమైనా ఉపముఖ్యమంత్రి సహకారంతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతున్నామని చెప్పారు.
మహిళలు కోటీశ్వరులు కావాలి: సీతక్క
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో పేదలకు సన్నబియ్యం ఇచ్చి కడుపునిండా అన్నం పెడుతున్నారని, నిలువనీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాలకు రూ.25 వేల కోట్ల బ్యాంకు లింకేజి ఇచ్చామని, రూ.2 కోట్లతో కేసముద్రంలో ఇందిరా మహిళా శక్తి భవనం మంజూరు చేశామని తెలిపారు. మహిళలకు రూ.10 లక్షల బీమా కల్పించామన్నారు. 18 నుంచి 60 ఏళ్ల వయసు మహిళలు సంఘాల్లో చేరాలని, కోటి మంది మహిళలను సంఘాల్లో చేరి, కోటీశ్వరులు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలను నమ్మొద్దు: సురేఖ
ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ప్రజలు వారిని నమ్మవద్దని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన నిరుపేదలకు పథకాలు చేరాలనే లక్ష్యంతో అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం ప్రధాన సలహాదారుడిగా వేం నరేందర్‌రెడ్డి ఉండడం కేసముద్రం ప్రజల అదృష్టమని, ఎవరూ ఊహించని విధంగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేయిస్తున్నారని చెప్పారు.
చరిత్రలో నిలిచిపోయేలా పథకాలు: వేం నరేందర్‌రెడ్డి
అప్పుల తెలంగాణలో పథకాలు అమలు చేయడం ఆషామాషీ కాదని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. చరిత్రలో ఎవరూ అమలు చేయని విధంగా పథకాలు రూపొందించి పేదలకు అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో మహబూబాబాద్‌తోపాటు కేసముద్రాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. అధికారం ప్రజల హక్కు అని, ప్రజల అభిమానంతోనే అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ బలరాంనాయక్, డిప్యూటీ స్పీకర్ రాంచందర్‌నాయక్, ఎమ్మెల్యేలు మురళీనాయక్, కెఆర్.నాగరాజు, కోరం కనకయ్య, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ తదితరులుపాల్గొన్నారు.