Share News

Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:40 AM

విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే మెరుగుపడ్డ తెలంగాణ నేడు ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.

Bhatti Vikramarka: విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు

  • విద్యారంగానికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం: డిప్యూటీ సీఎం

  • విక్టోరియా మెమోరియల్‌ హోంలో అనాథ విద్యార్థుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న భట్టి

ఎల్‌బీనగర్‌/హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే మెరుగుపడ్డ తెలంగాణ నేడు ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. అందుకే విద్యారంగానికి ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్‌ హోంలో అనాథ విద్యార్థుల నడుమ భట్టి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని.. మొదటి విడతలో రూ.11,600 కోట్లతో 100 పాఠశాలలను నెలకొల్పుతామని చెప్పారు. ఎంతో విలువైన విక్టోరియా మెమోరియల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా కాపాడతామన్నారు. విక్టోరియా మెమోరియల్‌ స్కూల్‌ అభివృద్ధి, స్కూల్‌ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ.5 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని.. ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.


గాంధీభవన్‌లో రక్తదాన శిబిరం..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా గాంధీభవన్‌లో ఏర్పాటైన రక్తదాన శిబిరాన్ని పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రె్‌సను అధికారంలోకి తేవడంలో భట్టి కీలకపాత్ర పోషించారన్నారు. భట్టిపై అభిమానంతో వందలాది మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:40 AM