Share News

Telangana Projects: తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలొద్దు

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:14 AM

ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి. తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా, రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నంత వరకూ వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం.

Telangana Projects: తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలొద్దు

ఎన్డీయే భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి

అప్పటి వరకూ ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతాం

ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ

గోదావరిలో నికర జలాల కేటాయింపులు జరగనప్పుడు

అదనపు జలాలను వినియోగించుకుంటామనడం సరికాదు

లెక్కలు తేలేది పూర్తిస్థాయి కేటాయింపులు జరిగిన తర్వాతే..

గతంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు అన్యాయం

గోదావరిలో తెలంగాణ నికర వాటా తేల్చాల్సిందే: సీఎం

పాలమూరు, సీతారామ, సమ్మక్క బ్యారేజీకి అనుమతులివ్వండి

కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి

కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి వినతి

న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సర్కారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇప్పించాలి. తెలంగాణకు నీటి కేటాయింపులు జరగకుండా, రాష్ట్ర ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నంత వరకూ వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపుతాం. ఈ విషయంలో ఎటువంటి శషబిషలకు తావులేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాత మిగతా వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

9lrs.jpg

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులన్నీ వచ్చిన తర్వాతే ఏపీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం దాదాపు గంటపాటు సమావేశమయ్యారు.


అనంతరం, మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ప్రధాని మోదీని కలిసి గోదావరిపై ప్రాజెక్టులు, జలాల అనుసంధానం తదితర అంశాలపై వివరించాననే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ‘‘కృష్ణా నదీ పరీవాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే 30 శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అందుకే, కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి’’ అని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కోరారు. తెలంగాణ వాటా నికర జలాలను తేల్చిన తర్వాతే గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కేఆర్‌ఎంబీ పక్షపాత ధోరణితో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం నీటిని కేటాయించిందని, ఫలితంగా, అనేక సంవత్సరాలుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం తమకు కేటాయించిన మొత్తానికి మించి నీటిని ఏపీ తరలించుకుపోతోందని ఆరోపించారు. ఇకపై ఏపీ తనకు కేటాయించిన వాటాకు మించి కృష్ణా నీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని పునరుద్ఘాటించారు. ‘‘పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్‌ సమర్పించాం. అయినా, అనుమతులు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారు. అలాగే, సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్‌ బ్యారేజీలకు కూడా అనుమతులు ఇవ్వలేదు. కానీ, న్యాయస్థానాల పరిధిలో ఉన్న అప్పర్‌ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారు. సీతారామ, సమ్మక్క సాగర్‌లకు సీడబ్ల్యూసీ, సాంకేతిక సలహా మండలి అనుమతులు ఇప్పించాలి’’ అని కోరారు. పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల పథకానికి రూపకల్పన చేసిందని, దీనికి సీడబ్ల్యూసీ, జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ అనుమతుల్లేవని తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్లోనూ దీనిపై ఎటువంటి చర్చ జరగలేదని గుర్తు చేశారు. గోదావరిలో తెలంగాణ నికర జలాల వాటా తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో ఏమాత్రం రాజీపడబోమని కేంద్ర మంత్రికి తేల్చి చెప్పారు. పాలమూరు, సీతారామ, మొడికుంటవాగు, చనాఖా కొరటా, చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల పథకాలకు ఏఐబీపీ కింద ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని, ముంపునకు సంబంధించి మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.



అదనపు జలాలను వాడుకుంటామనడం సరికాదు

సమ్మక్క సాగర్‌, సీతారామ సహా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని, అలాంటప్పుడు గోదావరిలో అదనపు నీళ్లున్నాయని, సముద్రంలో కలిసే ఆ నీళ్లను ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ చెప్పడం సరికాదని సీఎం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణలో శాశ్వత ప్రాజెక్టులకు పూర్తిస్థాయి కేటాయింపులు జరిగిన తర్వాతే.. వరద జలాలు ఉన్నాయా? లేదా అనేది లెక్క తేలుతుంది. గోదావరిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. సమ్మక్క బరాజ్‌, సీతారామ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ తుది అనుమతి రాలేదు. వాటిపై ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను బనకచర్ల ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తామని చెబుతోంది. అలాంటప్పుడు తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు అభ్యంతరాలు చెబుతోంది’’ అని ప్రశ్నించారు. గతంలో జరిగిన పొరపాటు కారణంగా కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు వినియోగిస్తుంటే.. తెలంగాణ కేవలం 299 టీఎంసీలకే పరిమితమైందని, తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. గోదావరి వరద జలాల లెక్క తేలిన తర్వాత తమ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ డీపీఆర్‌లు ఇవ్వాలని, వాటిపై చర్చ జరిపి తమ అభ్యంతరాలను చెబుతామని తెలిపారు. కృష్ణా నది విషయంలో ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో, అలాంటి సమస్యనే గోదావరి విషయంలోనూ ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.



నేటి నుంచి మీనాక్షి సమీక్షలు

హైదరాబాద్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితిపై అవగాహన, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు మంగళవారం నుంచి లోక్‌ సభ నియోజకవర్గాల వారీగా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గాంధీభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్‌, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి నాయకులతో ఆమె భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్‌, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్‌, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి నేతలతో భేటీ కానున్నారు.


ఏపీకి అడ్డుకట్ట వేయాలి: మంత్రి ఉత్తమ్‌

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నీటి తరలింపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరామని, తప్పకుండా జోక్యం చేసుకుంటామని సీఆర్‌ పాటిల్‌ హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. సాగర్‌ కుడి కాల్వ ద్వారా ఏపీ తీసుకెళుతున్న 10 వేల క్యూసెక్కుల నీటిని 5 వేల క్యూసెక్కులకు తగ్గించాలని కోరామని, ఇందుకు కూడా అంగీకరించారని తెలిపారు. ‘‘బనకచర్ల ప్రాజెక్టు కోసం ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. దానిపై మేం అభ్యంతరం తెలిపాం. ప్రాజెక్టుపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మాకు ఫీజిబులిటీ, డీపీఆర్‌ వంటివేమీ రాలేదని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి తెలిపారు’’ అని వివరించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకే ఎక్కువ వాటా ఉండాలని కోరామని, పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్‌ నీటి కేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. కాళేశ్వరం బరాజ్‌లు కుప్పకూలడానికి సంబంధించి ఎన్డీఎ్‌సఏ విచారణ జరుగుతోందని, దీనిపై త్వరగా నివేదిక తమకు ఇవ్వాలని కోరామని, దాని ఆధారంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని స్పష్టం చేశామని వివరించారు. అన్నింటికీ కేంద్రం మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌ రెడ్డి, కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.


Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

For Telangana News And Telugu News..

Updated Date - Mar 04 , 2025 | 04:14 AM