Supreme Court: హైకోర్టు సీజేతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం!
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:18 AM
తెలంగాణలో సివిల్ జడ్జిల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
తెలంగాణలో సివిల్ జడ్జిల నియామకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన అదనపు సొలిసిటర్ జనరల్
తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సివిల్ జడ్జిల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. సివిల్ జడ్జి నియామకాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా హైకోర్టు లేదా దాని అధీనంలోని కోర్టుల్లో కనీసం ఏడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలని హైకోర్టు రూపొందించిన నియమావళిలో ఉంది. కానీ, 2023 ఏప్రిల్ 12న నోటిఫికేషన్ జారీ కాగా, ఆ నియమావళి జూన్ 10న అమల్లోకి వచ్చింది. దీంతో 2017 నియమావళి ప్రకారమే అర్హత నిర్ణయించాలంటూ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సివిల్ జడ్జిగా ఎంపిక కావాలంటే.. ఆ అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణలోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలన్న నిబంధనను కూడా సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు అభ్యర్థులు కూడా నియామక ప్రక్రియలో పాల్గొనగా వారికి అవకాశం దక్కలేదని తెలిపారు.
11 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చి, మూడింటినే భర్తీ చేశారని, మిగిలిన ఎనిమిది పోస్టులను 2024 నోటిఫికేషన్‌కు మళ్లించారని తెలిపారు. అలాగే, మెరిట్‌లో ఉన్న అభ్యర్థులను పక్కనబెట్టి, తక్కువ మార్కులు సాధించిన వారికి (వారు తెలంగాణలోనే న్యాయవాదిగా పనిచేస్తున్నారనే కారణంతో) ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. స్పందించిన ధర్మాసనం.. ఇంకా ఖాళీలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులను ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నూతన నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలన్నది చీఫ్ జస్టిస్ అభిమతమా? లేదా దీనిపై పునఃసమీక్షకు అవకాశం ఉందా? అని అదనపు సొలిసిటర్ జనరల్‌ను అడిగింది. ‘‘పిటిషనర్లు మధ్యంతర ఉత్తర్వుల మేరకు పరీక్షలు రాసి, మెరిట్‌లో నిలిచారు. కొత్త నిబంధనల వల్ల మాత్రమే వారు నియామకానికి అర్హులుగా పరిగణించబడడం లేదు. చీఫ్ జస్టిస్ ఈ విషయంపై పునర్విచారణకు సిద్ధంగా ఉంటే, నియామకాలపై పునరాలోచన చేయవచ్చు కదా?’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పందించిన నటరాజన్.. తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ కొత్తగా బాధ్యతలు చేపట్టారని, ఆయనతో మాట్లాడిన తర్వాత అభిప్రాయం తెలియజేస్తామని చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.