Share News

BC Reservation Protest Bandh: నేడు తెలంగాణ బీసీ బంద్‌

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:37 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం....

BC Reservation Protest Bandh: నేడు తెలంగాణ బీసీ బంద్‌

  • 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు

  • అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

  • పలు విద్యా, వ్యాపార సంస్థల స్వచ్ఛంద మద్దతు

  • 42 శాతం రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం

  • సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా?:ఆర్‌.కృష్ణయ్య

  • సకల జనులు బంద్‌కు మద్దతుగా నిలవాలి: జాజుల

  • జర్నలిస్టులూ బాసటగా నిలవాలి: దాసు సురేశ్‌

  • కాంగ్రెస్‌ శ్రేణులు బంద్‌లో పాల్గొనాలి: మహేశ్‌గౌడ్‌

  • శాంతియుతంగా నిర్వహించాలి.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

  • కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేమూ వస్తాం: భట్టి

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌ నిర్వహించనుంది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. విద్యాసంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు, విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. కాగా, బంద్‌కుటీజీఎస్ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్‌లో పాల్గొని, తీవ్రత తగ్గిన తరువాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. కాగా, బీసీల బంద్‌కు అధికార కాంగ్రెస్‌ పూర్తి మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలంతా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ కూడా బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా బంద్‌కు మద్దతు ఉంటుందని తెలిపారు.

1.jpg


కేంద్ర ప్రభుత్వానికి సెగ తగలాలి..

రిజర్వేషన్ల కోసం నిర్వహిస్తున్న బీసీ బంద్‌ సెగ కేంద్ర ప్రభుత్వానికి తగలాలని బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. వైన్స్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు బంద్‌కు సహకరించాలని కోరారు. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు మినహాయించి అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, విద్యా సంస్థలు మూసి వేసి బంద్‌లో పాల్గొనాలన్నారు. రాష్ట్ర బంద్‌ సందర్భంగా ముందస్తు అరె్‌స్టలు ఉండవని, పోలీసులు పూర్తిగా సహకరించాలని కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ వైస్‌ చైర్మన్‌ వీజీఆర్‌ నారగోని, మీడియా కో-ఆర్డినేటర్‌ గుజ్జ కృష్ణల సంయుక్త ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందన్నారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తా నుంచి ముసారాంబాగ్‌ చౌరస్తా వరకు నిర్వహించిన విద్యార్థుల ర్యాలీకి ఆర్‌.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను కొట్టివేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా? సుప్రీంకోర్టు దేశాన్ని పరిపాలిస్తుందా? అని ప్రశ్నించారు. ‘జనాబా ప్రాతిపదిక రిజర్వేషన్లు మా హక్కు.’ అని అన్నారు. కాగా, బీసీ బంద్‌కు మద్దతుగా ఆటో యూనియన్‌ జేఏసీ నాయకులు శుక్రవారం ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్‌.కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు.

సకల జనులు మద్దతుగా నిలవాలి..

బీసీ రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం తలపెట్టిన తెలంగాణ బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బంద్‌కు సకల జనులు మద్దతుగా నిలవాలని కోరారు. బీసీ శ్రేణులన్నీ రాజకీయ పార్టీలను, సామాజిక ఉద్యమ ప్రగతిశీల శక్తులను సమన్వయం చేసుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్దంగా బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. బంద్‌ రోజు రాష్ట్ర ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ఢిల్లీ పాలకులకు దిమ్మ తిరగాలన్నారు. కాగా, రాష్ట్ర బంద్‌కు జర్నలిస్టులు బాసటగా నిలవాలని బీసీ జేఏసీ కో చైర్మన్‌ దాసు సురేష్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జై బీసీ ఉద్యమం అంటుకుందనీ, ఈ ఉద్యమానికి బీసీ జర్నలిస్టులు వారి కలాన్ని, గళాన్ని ఆయుధాలుగా అందించాలని కోరారు. మీడియా సంస్థలకు మూల స్తంభాలు బీసీలేనన్నారు. బీసీల ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నంగా బంద్‌కు అండగా నిలిచి విజయవంతం చేయాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. బీసీ జేఏసీ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతుగా నిలుస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బంద్‌కు మద్దతివ్వాలని బీసీ ఆర్‌.కృష్ణయ్య కోరిన నేపథ్యంలో ఆమె స్పందించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహిస్తామన్నారు.


సీపీఎం ఛలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌ సిఫారసు చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో రాజ్‌భవన్‌ ఉద్రికత్తకు దారితీసింది. రాజ్‌భవన్‌కు పెద్దసంఖ్యలో వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కొంతమంది నేతలను అనుమతించడంతో రాజ్‌భవన్‌లో వినతిపత్రం అందజేశారు.

బంద్‌లో పాల్గొనున్న టీపీసీసీ చీఫ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు

బీసీ బంద్‌లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ పాల్గొననున్నారు. అంబర్‌ పేటలోని ప్రధాన రహదారిలో జరిగే బంద్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సీనియర్‌ నేత వి. హన్మంతరావు పాల్గొంటారు. సికింద్రాబాద్‌లోని రేతిబౌలి బస్‌స్టాండ్‌ వద్ద బంద్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీగణేష్‌ పాల్గొంటారు. ఇమ్లీబన్‌ బస్‌ స్టేషన్‌ వద్ద మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొంటారు.

శాంతియుతంగా నిర్వహించాలి: డీజీపీ

బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. బంద్‌ పేరుతో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.


తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు సాఽధించే వరకు పోరాటం ఆగదని బీసీ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర బంద్‌కు సంఘీభావంగా శుక్రవారం బషీర్‌బాగ్‌లోని బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. చిక్కడపల్లిలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్‌ చిరంజీవులు. బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌ విశారదన్‌ మాహారాజ్‌ విలేకరులతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 24న చలో హైదరాబాద్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. బంద్‌ నేపథ్యంలో శనివారం నగరంలోని వివిధ వృత్తివిద్యా కళాశాలలు మూసివేయాలని ప్రైవేటు యాజమాన్యాలు నిర్ణయించాయి. శనివారం సెలవు ప్రకటించాయి. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం తెలుపుతున్నట్లు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 18 , 2025 | 08:37 AM