Share News

Sridhar Babu: టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:18 AM

టెక్నాలజీ అంటేనే ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

Sridhar Babu: టెక్నాలజీ అంటే హైదరాబాద్‌ వైపు చూడాలి

  • గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లుగా జీసీసీలు

  • ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా తెలంగాణకుంది: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : టెక్నాలజీ అంటేనే ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం జరిగిన 32వ హైసియా నేషనల్‌ సమ్మిట్‌ అండ్‌ అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్‌గా హైదరాబాద్‌ను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వాటిని గ్లోబల్‌ వాల్యూ యాడెడ్‌ సెంటర్లు(జీవీసీ)గా మార్చాలని సంకల్పించినట్లుగా వివరించారు.


తెలంగాణ ఐటీ రంగం వార్షిక వృద్ధి రేటు 13ు పైచిలుకు, ఐటీ ఎగుమతుల విలువ 32 బిలియన్‌ డాలర్లు, దేశీయ ఐటీ అవుట్‌పుట్‌ 5 బిలియన్‌ డాలర్లుగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మారే సత్తా తెలంగాణకు ఉం దన్నారు. పెట్టుబడులు హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నామన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. విదేశాలకు ముడి వస్తువులు, విడి భాగాలు సరఫరా చేయడానికే పరిమితం కాకుండా ఇక్కడే అంతిమ వినియోగ వస్తువులు తయారయ్యేలా చూడటమే తమ లక్ష్యమన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 05:18 AM