Share News

Shamshabad: నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా అరెస్ట్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:38 AM

నకిలీ వాహన బీమా పత్రాలు, డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందులో ముగ్గురిని అరెస్టు చేయగా, 15 మంది పరారీలో ఉన్నారు.

Shamshabad: నకిలీ డాక్యుమెంట్ల తయారీ ముఠా అరెస్ట్‌

  • ఇన్సూరెన్స్‌ పత్రాలు, ఆధార్‌, ఓటరు కార్డుల సృష్టి

  • పోలీసుల అదుపులో ముగ్గురు.. పరారీలో 15 మంది

  • శంషాబాద్‌ పరిధిలోని మధురానగర్‌లో దందా

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 17 (ఆంఽధ్రజ్యోతి): నకిలీ వాహన బీమా పత్రాలు, డాక్యుమెంట్లను తయారు చేస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందులో ముగ్గురిని అరెస్టు చేయగా, 15 మంది పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 26 నకిలీ ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌, మూడు మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌ సీఐ బాల్‌రాజ్‌ శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని మధురానగర్‌లో కొంత కాలంగా ఈ దందా నడుస్తోంది. ప్రధాన నిందితులు బహదూర్‌పూరకు చెందిన మహ్మద్‌ అవేస్‌, శంషాబాద్‌కు చెందిన బి.శ్రవణ్‌ కుమార్‌గౌడ్‌, షాబాద్‌ మండలం సర్దార్‌ నగర్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌ మరో 15 మంది ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.


వాహనాల నకిలీ ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు, ఆధార్‌, ఓటరు, పాన్‌ కార్డులు, గ్యాస్‌ బిల్లులు, బ్యాంకు పాస్‌ బుక్కులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, రెవెన్యూ పట్టా పాస్‌ బుక్‌లు, తదితర పత్రాలను ఈ ముఠా సభ్యులు తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం దాడులు చేసి ప్రధాన నిందితులు మహ్మద్‌ అవేస్‌, శ్రవణ్‌కుమార్‌, శివకుమార్‌ను పట్టుకున్నారు. మరో 15 మంది పరారయ్యారు. ఏ2 నుంచి ఏ14 వరకు ఉన్న నిందితులు జంట నగరాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. వీరు పలు ఇన్సూరెన్స్‌ కంపెనీల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

Updated Date - Jan 18 , 2025 | 03:38 AM