Share News

Supreme Court: వైద్య విద్యలో ప్రవేశానికి.. ‘నాలుగేళ్ల స్థానికత’ తప్పనిసరి

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:09 AM

తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియరైంది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12వ తరగతి వరకు.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో-33ని సుప్రీంకోర్టు సమర్థించింది.

Supreme Court: వైద్య విద్యలో ప్రవేశానికి.. ‘నాలుగేళ్ల స్థానికత’ తప్పనిసరి

  • 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే

  • తెలంగాణ ప్రభుత్వ జీవో 33ని సమర్థించిన

  • సుప్రీంకోర్టు.. హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత

  • 4 క్యాటగిరీలకు ప్రత్యేక మినహాయింపు

  • స్థానికత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు

  • వైద్య విద్యలో ప్రవేశాలకు లైన్‌ క్లియర్‌

  • 11 తర్వాత కన్వీనర్‌ కోటా కౌన్సిలింగ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు లైన్‌ క్లియరైంది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12వ తరగతి వరకు.. నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో-33ని సుప్రీంకోర్టు సమర్థించింది. గత ఏడాది ఆ జీవోలో చేసిన సవరణను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఆ జీవోను వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్‌, మరో 160 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..! దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ‘‘ఒక విద్యార్థి తెలంగాణలో శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా లేవు. మొదట మార్గదర్శకాలు, నిబంధలను రూపొందించండి’’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గత నెల 5న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం తన తీర్పు ను రిజర్వ్‌ చేసింది. సోమవారం 32 పేజీల తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. 2017లో రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన జీవో, 2024లో చేసిన సవరణను సమర్థించింది. గత ఏడాది స్థానికత అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి, సీట్లు పొందిన విద్యార్థులకు తమ తీర్పు వర్తించదని తెలిపింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.


తెలంగాణ సర్కారు బలమైన వాదనలు

తన అప్పీల్‌పై తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో బలమైన వాదనలను వినిపించింది. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూసింఘ్వీ విచారణ సందర్భంగా సుదీర్ఘంగా వాదించారు. ‘‘సంపన్నుల పిల్లలు విదేశాల్లో 11, 12వ తరగతి చదువుకుంటే.. ఎక్కడైనా వైద్యవిద్య సీట్లను పొందగలరు. తెలంగాణ స్థానికతతో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, ఈ నిబంధనను తీసుకొచ్చాం’’ అని పేర్కొంటూ పలు తీర్పులను ప్రస్తావించారు. అసోం, హరియాణా, మరికొన్ని రాష్ట్రాల్లో స్థానికతపై ఉన్న నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ స్థానికత అమలవుతోందని, అక్కడ వైద్యవిద్యను అభ్యసించేందుకు తెలంగాణ విద్యార్థులకు అవకాశమే లేదని వివరించారు. కాళోజీ వర్సిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపా ల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలను వినిపించారు. తెలంగాణ పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడులోనూ ఈ తరహా నిబంధనలున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్య వస్థీకరణ చట్టం, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్‌ 371(డీ) కింద పదేళ్లపాటు ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పించామ ని, దాని గడువు ముగియడంతో.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చిందని వెల్లడించారు. ధర్మాసనం ఈ వాదనలను కీలకంగా పరిగణించి, తుదితీర్పునిచ్చింది. ఆర్టికల్‌ 371(డీ), 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగానే జీవో 33 ఉందని అభిప్రాయపడింది. ఆల్‌-ఇండియా కోటాలో 15ు సీట్లను కేటాయించడాన్ని స్వాగతించింది. స్థానికత విషయంలో 4 క్యాటగిరీల ఉద్యోగుల పిల్లలకు మినహాయింపులను సూచించింది.

సుప్రీంకోర్టు మినహాయింపులివే..

  • రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు(క్యాటగిరి-1), రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని కార్పొరేషన్లు, ఏజెన్సీల్లో పనిచేసేవారు(క్యాటగిరి-4) విధినిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసి ఉంటే.. వారి పిల్లలు 9 నుంచి 12 తరగతులు తెలంగాణలో చదవకున్నా.. వైద్యవిద్యకు అర్హులు.

  • ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, ఐపీఎస్‌ వంటి ఆల్‌-ఇండియా సర్వీసుల అధికారులు(క్యాటగిరి-2) తెలంగాణ వెలుపల విధులు నిర్వహిస్తే.. ఆ కాలానికి అనుగుణంగా వారి పిల్లలకు మినహాయింపు ఉంటుంది.

  • రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో పనిచేసే తెలంగాణ పౌరుల(క్యాటగిరి-3) పిల్లలకూ మినహాయింపు ఇవ్వాల్సిందే. ఈ 4 క్యాటగిరీల్లోనూ ఉద్యోగుల పిల్లలు ఇతర రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు చదువుకున్న ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.


11వ తేదీ తర్వాత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌

నిజానికి యాజమాన్య, ఎన్నారై కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసినా.. జూలై చివరి వారంలోనే కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని కాళోజీ వర్సిటీ నిర్ణయించింది. స్థానికత, ఆలిండియా కోటాపై స్పష్టత లేక.. ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు వైద్యవిద్యలో ప్రవేశాలకు లైన్‌ క్లియరైంది. సుప్రీంకోర్టు పేర్కొన్న 4 క్యాటగిరీలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి వర్సిటీ లేఖ రాసింది. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాగానే.. నోటిఫికేషన్‌ జారీ కానుంది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాను విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ వెంటనే తుది జాబితా విడుదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 10లోగా పూర్తిచేయాలని వర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. 11 నుంచి కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఆల్‌ఇండియా కోటా రెండో విడత ప్రవేశాల షెడ్యూల్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) విడుదల చేసింది. ఈ నెల 4-12 తేదీల మధ్య ఈ కోటాలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది. సీటు పొందిన వారు 19లోగా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మూడో విడతను ఈనెల 24 నుంచి వచ్చేనెల 3 మధ్య నిర్వహిస్తారు. సీటు పొందినవారు అక్టోబరు 10లోగా కళాశాలల్లో చేరాలి. మిగిలిపోయిన సీట్లకు అక్టోబరు 14-18 తేదీల్లో తుది విడతగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కాగా.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 8,515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా.. వాటిలో 613 సీట్లను ఆలిండియా కోటాకు కేటాయించారు.

Updated Date - Sep 02 , 2025 | 02:09 AM