Supreme Court: సుప్రీం సస్పెన్స్!
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:22 AM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ....
జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పైనేడు విచారణ చేపట్టనున్న సర్వోన్నత న్యాయస్థానం
బీసీ రిజర్వేషన్లపై తగ్గేది లేదు.. బలంగా వాదించండి
సీనియర్ న్యాయవాదులతో సీఎం రేవంత్‌రెడ్డి
అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ్ దవేలతో ఫోన్‌లో మంతనాలు
ఢిల్లీకి హుటాహుటిన భట్టివిక్రమార్క, పొన్నం, వాకిటి
42 శాతంపై కోర్టుల్లో ప్రతికూల స్పందన వస్తే పార్టీ పరంగా బీసీలకు ఆ మేరకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ దవేతో ఫోన్‌లో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంటకు పైగా చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42ు బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, ఆ దిశగా ముందుకెళ్లాలని సీనియర్ న్యాయవాదుల ఎదుట చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సహా ఇతర కేసులగురించి చర్చించినట్టు సమాచారం.

ఢిల్లీకి భట్టి విక్రమార్క, పొన్నం, వాకిటి..
జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వారి వెంట బీసీ సంక్షేమం, సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు. జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరఫున వాదన లు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో వారు భేటీ కానున్నారు. కులగణన సర్వే మొదలుకుని జీవో 9 జారీకి దారి తీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆయన కు వివరించనున్నారు. కాగా, మంత్రుల బృందం ఆదివారం రాత్రి సుప్రీంకోర్టులో తెలంగాణ స్టాండిం గ్ కౌన్సిల్ శ్రవణ్‌కుమార్‌తో సమావేశమై చర్చలు జరిపింది. కాగా, సుప్రీంలో పిటిషన్ దాఖలైన వెంట నే బీసీ సంక్షేమ శాఖ అధికారుల బృందం ఢిల్లీకి చేరుకుంది. బీసీ రిజర్వేషన్లు, అమలు, కొత్త జీవో తదితర అంశాలపై న్యాయవాదులతో చర్చించింది.
సుప్రీంకోర్టు స్పందనపై నేతల్లో ఉత్కంఠ..
జీవో 9ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అధికార కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా.. దానిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. అయితే ఆ జీవోకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, సంఘాలతో హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే.. సుప్రీంకోర్టులోనూ జీవో 9కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉన్నందున.. అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెబుతుందా? లేక ఏదైనా సూచన చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో.. చట్ట విరుద్దమంటూ పిటిషన్‌దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ప్రభు త్వం తరఫున బలమైన వాదనలు వినిపించడంలో న్యాయవాదులకు సహకారం అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అధికారులు ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలపై ముందుకే..!
జీవో 9పై న్యాయస్థానాల స్పందన ఎలా ఉన్నా.. ఎన్నికలపై ముందుకే వెళ్లాలన్న యోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జీవో 9 పట్ల కోర్టులు సానుకూలంగా స్పందిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టుల స్పందన ప్రతికూలంగా ఉంటే.. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్లాన్-బీ సిద్ధం చేసుకుని ఉన్నట్లు చెబుతున్నారు. జీవో 9 రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఒకవేళ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా, లేక ఈ నెల 8న హైకోర్టు ఇలా సూచించినా.. తమ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు ప్రకటించి ఎన్నికలపై ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే సాంకేతికంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది కాబట్టి.. ఎన్నికల షెడ్యూల్‌ను రీ షెడ్యూల్ చేయాల్సి రావచ్చునని అంటున్నారు.
‘జీవో 9తో ప్రాథమిక హక్కులకు భంగం’
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ ఈ నెల 4న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వంగా గోపాల్‌రెడ్డి.. అందు లో పలు అంశాలను ప్రస్తావించారు. ‘‘బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9ని తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే ఎస్సీలకు అమల్లో ఉన్న 15ు, ఎస్టీలకు 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధం. జీవో 9 ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదంఉంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఇవకాశాలు తక్కువగా ఉన్నందున నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాం. అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవో అమలుపై స్టే ఇవ్వండి’’ అని గోపాల్‌రెడ్డి పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.