Child Welfare: చేరదీసి చదివిస్తూ.. అవసరమైన ధ్రువపత్రాలిస్తూ..!
ABN , Publish Date - Feb 08 , 2025 | 02:49 AM
రోడ్ల వెంట భిక్షాటన చేస్తూ ఇబ్బందులు పడుతున్న వారిని చేరదీస్తూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు.

అనాథ పిల్లలకు అండగా హైదరాబాద్ ఐసీడీఎస్ అధికారులు
గత ఏడాది 1,088 మందికి జనన, ఆధార్, కుల ధ్రువీకరణ సహా పలు పత్రాల జారీ.. కలెక్టర్ ప్రత్యేక చొరవ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు, పేదరికంతో కుటుంబానికి దూరమైన పిల్లలకు హైదరాబాద్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు తమ వంతు తోడ్పాటునందిస్తున్నారు. రోడ్ల వెంట భిక్షాటన చేస్తూ ఇబ్బందులు పడుతున్న వారిని చేరదీస్తూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆటపాటలతో కూడిన బోధనలు అందిస్తుండడంతోపాటు వారి భవిష్యత్తు చదువులకు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నారు. పుట్టిన తేది, ఏ కులమో తెలియక సతమతమవుతున్న వారికి నిర్దేశిత సర్టిఫికెట్లను జారీ చేస్తూ అండగా ఉంటున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 6 ప్రభుత్వ, 44 ప్రైవేట్ శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇందులో ప్రస్తుతం 2,350 మంది పిల్లలున్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది ఎవరూ లేని అనాథలే కావడంతో జనన, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాల వంటి వాటి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు 2 నుంచి 9 వరకు 8 శిశు సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 7 రకాల (జనన, అనాథ గుర్తింపు, కుల ధ్రువీకరణ, ఆదాయం, నివాసం, ఆధార్, సదరం) సర్టిఫికెట్లను పిల్లలకు అందించారు. అనాథ పిల్లల జనన ధ్రువీకరణ పత్రంలో సంరక్షకుడిగా ప్రస్తుతం వారుండే శిశు సంరక్షణ కేంద్రం (సీసీఐ) అధికారి పేరు చేర్చి ఇచ్చారు. వయసు నిర్ధారణ కోసం గాంధీ, ఉస్మానియా డాక్టర్లను సంప్రదించి వేశారు.
ఇక.. ఆధార్ కార్డులో అడ్రస్ ప్రస్తుతం ఉంటున్న కేంద్రాన్ని పొందుపరచ్చారు. కులం సర్టిఫికెట్‌లో అనాథ పిల్లలకు బీసీ-ఏ కింద ఇవ్వగా.. తల్లిదండ్రులు లేదా బంధువులున్న పిల్లలకు వారి కులాన్ని చేర్చి ఇచ్చారు. ఇలా మొత్తం.. ఆ వారం రోజుల్లో 1,330 వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కాగా, రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ జిల్లాలో అనాథ పిల్లలకు జనన, కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తుండటంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. గతే డాది సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అనుదీప్ చొరవను ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..