Share News

BC Reservation: హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:02 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే విషయంలో చట్టపరంగా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశామని, దీనిపై హైకోర్టులో జరిగే విచారణలో బలమైన వాదనలు వినిపిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి...

BC Reservation: హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం

  • బీసీ రిజర్వేషన్లకు చేయాల్సిందంతా చేశాం

  • జీవో 9 నిలబడుతుందనే నమ్ముతున్నా

  • ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదిస్తారు

  • విచారణను బీసీ మంత్రులు పర్యవేక్షించాలి

  • ఇంప్లీడ్‌ అయినవారు అందుబాటులో ఉండాలి

  • మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి భేటీకి నిర్ణయం

  • ధాన్యం కొనుగోలుపై మంత్రులతో సీఎం చర్చ

  • పొన్నం, అడ్లూరి వివాదంపై రేవంత్‌ ఆరా

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే విషయంలో చట్టపరంగా చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశామని, దీనిపై హైకోర్టులో జరిగే విచారణలో బలమైన వాదనలు వినిపిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. న్యాయస్థానాల సూచనలకు అనుగుణంగా కులగణన సర్వే నిర్వహించి.. ఎంపిరికల్‌ డాటా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 న్యాయసమీక్షకు నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టులో బుధవారం విచారణ జరుగుతున్న సందర్భంలో బీసీ మంత్రులంతా అక్కడే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. జీవో 9ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్‌కు అనుకూలంగా అఫిడవిట్‌ ఇచ్చి.. కేసులో ఇంప్లీడ్‌ అయినవారు కూడా విచారణ సందర్భంగా అందుబాటులో ఉండాలన్నారు. సమావేశం నుంచే ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీకి ఫోన్‌ చేసి.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఆయనకు వివరించారు. కాగా, సింఘ్వీ వర్చువల్‌గా వాదనలు వినిపించనున్నారు.


అవసరమైతే సుప్రీంకోర్టుకు!

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు, మంత్రులు వ్యక్తం చేశారు. స్పందన సానుకూలంగా లేకపోతే ఏం చేయాలన్న చర్చ కూడా జరిగింది. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్‌ ప్రకటించి ముందుకెళ్లాలా? లేక న్యాయపోరాటం కొనసాగించాలా? అన్నదానిపై చర్చించారు. ఒకవేళ హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పరిస్థితి తలెత్తితే.. వెంటనే సమావేశమై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. దీంతోపాటు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కూడా ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చర్చించారు. రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ల వివాదంపై ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ఆరా తీశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు మంత్రి అడ్లూరిని ఉద్దేశించినవి కావని పొన్నం వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

నేడు హైకోర్టు వద్ద బీసీ నేతల మోహరింపు..

బీసీ రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న సమయంలో బీసీ నాయకులు, సంఘాల నేతలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున కోర్టుకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ బీసీ నేతల సమావేశంలో నిర్ణయించారు. మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, పార్టీ బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందన్న విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేశారు. అయితే పిటిషన్‌ను కొట్టివేయకుండా రాజ్యాంగ ధర్మాసనానికి ఇచ్చే అవకాశమూ ఉందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేశారు. కాగా, బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్‌ అయిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలకు మీనాక్షీ నటరాజన్‌ సూచించారు. వాదనలు జరిగే సమయంలో వారంతా అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా.. బీఆర్‌ఎస్‌ నుంచి ఒక్క నేత కూడా కేసులో ఇంప్లీడ్‌ కాలేదని, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాత్రమే ఇంప్లీడ్‌ అయ్యారనే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో బీసీల పట్ల బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు ఉన్న చిత్తశుద్ధి ఇదీ అని మహేశ్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 08 , 2025 | 07:16 AM