Srushti Case: నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత.. ఏబీఎన్ చేతిలో కీలక రిపోర్ట్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:16 PM
Srushti Case: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కన్ఫెషన్ రిపోర్ట్ ద్వారా కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం డాక్టర్ నమ్రత ఏం చెప్పిందంటే.. ‘1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించాను. 2007లో సికింద్రాబాద్లో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత వైజాగ్‌లోనూ మరో ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించాను. నా రెండవ కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించేవాడు.
సరోగసి పేరుతో ఒక్కో జంట దగ్గర 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేశాము. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేశాము. అబార్షన్ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలను గుర్తించి వారికి డబ్బులు ఆశ చూపాము. ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేశాము. ఎంతోమంది పిల్లలు లేని దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించాము. మొదట మహారాణిపేట పోలీస్ స్టేషన్లో నా మీద కేసు నమోదు అయింది. ఆ తరువాత వైజాగ్ టూ టౌన్ , గోపాలపురం పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు.. గుంటూరు కొత్తపేటలో మరో కేసు నమోదైంది.
2020లో మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్‌కు వెళ్లి వచ్చాను. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజయ్‌తో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించారు. సికింద్రాబాద్ సెంటర్లో సూపర్వైజర్ కం ఫార్మసిస్ట్‌గా కృష్ణ.. రిసెప్షనిస్ట్‌గా పద్మ.. టెలికాలర్‌గా అర్చన, మేరీ, సోనా.. నర్సుగా సురేఖ.. ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రభాకర్ ఉన్నారు. వైజాగ్ సెంటర్లో మేనేజర్‌గా కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్‌గా రమ్య ఉన్నారు. విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ కరుణ కీలకంగా వ్యవహరించారు.
అనస్తీషియా డాక్టర్‌గా గాంధీ హాస్పిటల్‌కి చెందిన సదానందం కీలకంగా ఉన్నారు. డబ్బు మొత్తాన్ని వివిధ బ్యాంకులకు బదిలీ చేశాను. సరోగసి కేస్ షీట్లు మొత్తాన్ని ఎవరు ముట్టుకోకుండా భద్రంగా దాచాను. నా కన్సల్టెన్సీ రూమ్‌లో ప్రత్యేక బాక్సులో భద్రపరిచాను. గోపాలపురంలో ఫిర్యాదు చేసిన రాజస్థాన్ దంపతుల కేస్‌లో సరోగసి ద్వారా బిడ్డను ఇస్తానని నమ్మించాను’ అని అంది.
ఇవి కూడా చదవండి
రెండు రోజుల్లో రెండోసారి.. ఎక్కడికెళ్లినా అదే మాట..
జుట్టుతో తయారైన టూత్ పేస్ట్.. ఇన్ని లాభాలు ఉన్నాయా?..