Sridhar Babu: బలహీన వర్గాలకు రిజర్వేషన్లే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:50 AM
బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కృష్ణా, గోదావరి జలాల్లో రాజీ ప్రసక్తే లేదు: దుద్దిళ్ల
కరీంనగర్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో కమిషన్‌ను ఏర్పాటు చేసి కులగణన సర్వే చేపట్టామని చెప్పారు.
రిజర్వేషన్లను 50 శాతానికి పైగా పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తుందా? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల వివాదంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జలాల వివాదంలో మిన్నకుండి కృష్ణా, గోదావరి జలాల విషయంలో రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు.