New Ministers: నేడో రేపో శాఖల కేటాయింపు
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:49 AM
ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది.
ఎవరికీ కేటాయించని శాఖలు ఇచ్చే చాన్స్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాతినిధ్యం
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడో, రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమ లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలనే కొత్తవారికి ఇచ్చే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికీ కేటాయించని శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్థకశాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించే అవకాశముందన్న ఆతృతతో ఉన్న కొత్త మంత్రుల అనుచరులు, శ్రేయోభిలాషులు, నియోజకవర్గ నేతలు గాంధీభవన్, సచివాలయ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈమారు కూడా అధిష్ఠానం సూచనలు, సలహాల మేరకే శాఖల కేటాయింపు ఉంటుందా? లేక సీఎం సొంతంగా నిర్ణయించి ఇస్తారా అన్నది వేచి చూడాలి.
మూడు జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు..
తాజా మంత్రివర్గ విస్తరణతో ఉమ్మడి జిల్లాలైన కొన్నింటికి ముగ్గురేసి చొప్పున మంత్రులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండగా.. తాజాగా అడ్లూరి లక్ష్మణ్ అమాత్యుల జాబితాలో చేరిపోయారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్‌తో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి చేరడంతో ఆ జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ముగ్గురికి ప్రాతినిధ్యం దక్కినట్లు అయింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే తుమ్మల, పొంగులేటి, భట్టి విక్రమార్క ఉన్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ నుంచి ఒక్కొక్కరికి ప్రాధాన్యం దక్కింది. గడ్డం వివేక్‌కు మంత్రి పదవి రావడంతో తొలిసారి ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కినట్లయింది. కాగా నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ఇప్పటిదాకా చోటు దక్కలేదు. మలి విస్తరణలో ఈ మూడు జిల్లాలకు అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News