High Court: క్రిమినల్ కేసుల దర్యాప్తునకు బృందాలు ఉండాలి
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:51 AM
క్రిమినల్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం, ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులతో కూడిన బృందాలు ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.
శిక్షణ లేక కొరవడిన నాణ్యత.. హైకోర్టు వ్యాఖ్యలు
లైంగికదాడి కేసులో డీఆర్‌డీఏ అధికారికి విముక్తి
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): క్రిమినల్ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం, ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులతో కూడిన బృందాలు ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్ కేసుల దర్యాప్తు చేపడుతున్న పోలీసు అధికారులకు శాంతిభద్రతలు సహా అనేక బాధ్యతలు ఉంటున్నాయని, అందువల్ల దర్యాప్తులో నాణ్యత దిగజారిపోతోందని వ్యాఖ్యానించింది. కేసును కేటాయించిన దర్యాప్తు అధికారికి తన బాధ్యతలు ఏమిటో నిర్దిష్టంగా ముందే చెప్పాలని, అందుకు ఆ అధికారి జవాబుదారీగా ఉండాలని సూచించింది. లైంగికదాడి కేసులో డీఆర్‌డీఓ అధికారికి విముక్తి కలిగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
స్నేహితురాలి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు శామీర్‌పేట్ డీఆర్‌డీవోలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న కల్నల్ రిషి శర్మపై కేసు నమోదైంది. ఈ కేసులో శర్మను దోషిగా తేల్చిన రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు కం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవితఖైదు విధించింది. దీనిపై ఆయన హైకోర్టులో అప్పీల్ చేయగా జస్టిస్ పి. శ్యాంకోషీ, జస్టిస్ తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని తెలిపింది. కనీస ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.