Revanth Reddy: కోర్ అర్బన్ రీజియన్‌కు ప్రత్యేక పాలసీ
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:17 AM
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉండే కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి ప్రత్యేక పాలసీ రూపొందించనున్నట్లు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధత కోసం అత్యవసర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ
అభివృద్ధికి రూపకల్పన
అధికారులకు సీఎం ఆదేశాలు
వర్షాకాల సన్నద్ధతపై సమీక్ష
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): కోర్ అర్బన్ రీజియన్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. మంగళవారం వర్షాకాల సన్నద్ధతతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ సహా అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇక వర్షాకాల సన్నద్ధత నేపథ్యంలో అత్యవసర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నగరంలో ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్లకు సంబంఽధించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్‌లోకి చేరే వర్షపు నీటిని పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులను వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్థం చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్‌లోనూ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news