Share News

SLBC tunnel Excavation: ఎస్‌ఎల్‌బీసీలో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యం

ABN , Publish Date - May 28 , 2025 | 04:53 AM

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ తవ్వకానికి టీబీఎం ఉపయోగించలేమని సాంకేతిక కమిటీ తెలిపింది. భవిష్యత్‌లో డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంతోనే టన్నెల్‌ తవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

SLBC tunnel Excavation: ఎస్‌ఎల్‌బీసీలో టీబీఎంతో తవ్వకాలు అసాధ్యం

  • డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో టన్నెలింగ్‌

  • ప్రభుత్వానికి సాంకేతిక కమిటీ సిఫారసు

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ఇన్‌లెట్‌(శ్రీశైలం) వైపు సొరంగం తవ్వకానికి సంబంధించి ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ వైపు ఇకపై టీబీఎం(టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్‌)తో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం(డీబీఎం)లో టన్నెల్‌ తవ్వకం చేపట్టాలని సూచించింది. కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతికి లోబడి పనులు చేపట్టాలని పేర్కొంది. అలాగే, ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రాక్‌ మెకానిక్స్‌(ఎన్‌ఐఆర్‌ఎం) ప్రతినిధి డాక్టర్‌ అజయ్‌కుమార్‌ నైథాని సహకారం తీసుకోవాలని చెప్పింది. ప్రమాదకర జోన్‌లో ఉన్న 50 మీటర్లపై జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎ్‌సఐ), జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ద్వారా సమగ్ర సర్వేకు సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది. అయితే, ఈ నెల 30వ తేదీ లోగా టన్నెల్‌లో భూసాంకేతిక(జియో టెక్నికల్‌) పరీక్షలు, జూన్‌ 30 నాటికి సమగ్ర సర్వే, ఇతర ప్రక్రియలను, ఆగస్టుకల్లా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కమిటీ సూచించింది. ఇక టన్నెల్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానానికి అయ్యే ఖర్చును అంచనా వేసి, దానికి అనుగుణంగా ఒప్పందాన్ని సవరించాలని సిఫారసు చేసింది. మిగిలిన టన్నెల్‌ తవ్వకం పనులను ఎప్పట్లోగా పూర్తి చేస్తారో నిర్మాణ సంస్థ(జయప్రకాష్‌ అసోసియేట్స్‌) నుంచి ప్రణాళికను తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది.

Updated Date - May 28 , 2025 | 04:55 AM