SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలు.. కన్వేయర్ బెల్టుకు మరమ్మతులు
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:18 AM
బురదను బయటకు తరలించే కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు.. వెరసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదస్థలిలో సహాయకచర్యలకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. ప్రమాదం జరిగి 10 రోజులు అవుతున్నా..
5 చోట్ల కొనసాగుతున్న తవ్వకాలు.. టీబీఎంను కట్ చేస్తేనే చివరకు
అచ్చంపేట/పదర, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఉబికివస్తున్న ఊట నీరు.. 5-10 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద మట్టి.. టీబీఎం యంత్రాన్ని కట్ చేశాక, బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు లేకపోవడం.. బురదను బయటకు తరలించే కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు.. వెరసి నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదస్థలిలో సహాయకచర్యలకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. ప్రమాదం జరిగి 10 రోజులు అవుతున్నా.. గల్లంతైన 8 మంది జాడ తెలియడం లేదు. ఉపగ్రహ సెన్సర్‌తో ఐదు చోట్ల బురదలో మెత్తటి అవశేషాల జాడను గుర్తించినా.. అక్కడ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీబీఎంను పూర్తిగా కట్‌చేసి, శకలాలను తొలగిస్తేనే.. టన్నెల్ చివరకు చేరుకునే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు బురద తొలగింపును వేగవంతం చేసేందుకు కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు 8మంది సింగరేణి ఇంజనీర్లు, ఫిట్టర్లు అహరహం శ్రమిస్తున్నారు. యంత్రాల సాయంతో టన్నెల్‌లోని నీటిని తోడే ప్రయత్నాలను వేగవంతం చేయగా.. మరో ఎక్స్‌కవేటర్‌ను లోనికి పంపేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా, సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బందిని రక్షించడానికి అన్నిరకాల సహాయ చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ సంస్థ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఏజీ సుదర్శన్ రెడ్డి వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం..ప్రస్తుత దశలో ఈ అంశంపై విచారణ చేపట్టడం సమంజసం కాదని తెలిపింది. విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..