IT Minister Sridhar Babu: డిగ్రీలు కాదు.. కావాల్సింది నైపుణ్యం
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:58 AM
ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీల కంటే నైపుణ్యమే కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
కొత్త విషయాలు నేర్చుకుంటేనే విజయాలు: శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూలై 15(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీల కంటే నైపుణ్యమే కీలకమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాలం చెల్లిన జ్ఞానాన్ని విడిచిపెట్టి, నిరంతరం నూతన విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగితేనే విజయాలు వరిస్తాయని పేర్కొన్నారు. లెర్న్, అన్ లెర్న్, రీ లెర్న్’ అనేది ఇప్పుడు సక్సె్‌సకు ఫార్ములా అని వివరించారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘మన అమెరికా తెలుగు సంఘం(మాట) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ పొందినవారికి మంత్రి ధ్రువీకరణపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పటిలా చేతిలో డిగ్రీ ఉంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, 50ు మంది పట్టభద్రులకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లేవని నాస్కామ్ గుర్తించిందని తెలిపారు. ‘ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కనుమరుగైపోతాయనే ఆందోళన వద్దు. 2025 నాటికి 8.5 కోట్ల ఉద్యోగాలు రోబోలు, ఏఐ వల్ల పోతే.. కొత్తగా 9.7 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వరల్డ్ ఎకానమిక్ ఫోరం తేల్చింది. అని చెప్పారు. కాగా, బెంగళూరులోని ఫ్రాన్స్ దౌత్యాధికారి మార్క్ లామీ మంత్రి శ్రీధర్‌బాబును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ - ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.