Share News

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:37 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో శనివారం సాయంత్రం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి

 Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ వద్ద గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం

7 గంటలు శ్రమించి వెలికితీసిన రెస్క్యూ బృందాలు

మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో శనివారం సాయంత్రం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. శనివారం రాత్రే రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం వెతికేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో వీలు కాలేదు. ఉదయం 5.41 గంటలకు మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన తొగరి రక్షిత్‌(13) మృతదేహం లభ్యమవగా.. 6.50 గంటలకు మహాముత్తారం మండలం స్థంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్‌(18) మృతదేహాన్ని వెలికితీశారు. సుమారు మూడు గంటల తర్వాత ఉదయం 9.45 గంటలకు మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన కర్ణాల సాగర్‌(16) మృతదేహం దొరికింది. 10.07 గంటలకు అంబట్‌పల్లికి చెందిన పట్టి మధుసూదన్‌(18), 11.16 గంటలకు మహముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్‌(17), చివరగా ఉదయం 11.45గంటలకు అంబట్‌పల్లికి చెందిన పట్టి శివమనోజ్‌(15) మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌లో రెస్క్యూ బృందాలు సుమారు 7 గంటల పాటు శ్రమించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనంతరం వారి కుటుంబాలకు అప్పగించారు. కాగా, రాత్రంతా బాధిత కుటుంబ సభ్యులు గోదావరి నది వద్దనే ఉన్నారు. చేతికందిన కుమారులు చేజారిపోవడాన్ని జీర్ణించుకోలేని బాధిత కుటుంబాలు.. రోదించిన తీరు అక్కడున్నవారిని కలచివేసింది. వారిని బీఆర్‌ఎస్‌ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్ట మధు పరామర్శించారు. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:37 AM