Women Employment,: అతివలకు అపెరల్ ఆసరా
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:43 AM
నాడు అరకొర సంపాదనతో కుటుంబ పోషణ భారమై.. నిర్జీవంగా మారిన ఆ మోముల్లో ఇప్పుడు జీవ కళ ఉట్టిపడుతోంది. సిరిసిల్ల మహిళలకు ఇక్కడి అపెరల్ పార్కు ఆసరాగా నిలుస్తోంది.
ఉపాధిని అందిస్తున్న అపెరల్ పార్కు
లబ్ధి పొందుతున్న 3,600 మంది మహిళలు
సిరిసిల్లకు వస్తున్న అంతర్జాతీయ కంపెనీలు
సిరిసిల్ల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పట్టెడన్నం కోసం రేయింబవళ్లు బీడీలు చుట్టిన ఆ చేతుల్లో ఇప్పుడు అందమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. నాడు అరకొర సంపాదనతో కుటుంబ పోషణ భారమై.. నిర్జీవంగా మారిన ఆ మోముల్లో ఇప్పుడు జీవ కళ ఉట్టిపడుతోంది. సిరిసిల్ల మహిళలకు ఇక్కడి అపెరల్ పార్కు ఆసరాగా నిలుస్తోంది. జిల్లా కేంద్రం శివారులోని సర్దాపూర్- పెద్దూర్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఈ పార్కులోని గార్మెంట్ పరిశ్రమలు ప్రస్తుతం 3,600 మందికి పైగా మహిళలకు ఉపాధిని అందిస్తున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఇక్కడి అపెరల్ పార్కు మహిళా కార్మికుల కోసం 60 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూ. 174 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లను కేటాయించారు. దీంతో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలు, పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ఇక్కడకు తరలివస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఓ కంపెనీ ప్రారంభం కాగా, కాంగ్రెస్ సర్కారు ఏర్పడగానే మరో పరిశ్రమ ఉత్పత్తులు ప్రారంభించింది. 2021 ఏప్రిల్‌లో గోకుల్‌దాస్ ఇమేజ్ గార్మెంట్ సంస్థ యూనిట్‌ను ప్రారంభించగా ప్రస్తుతం దాదాపు 1600 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. రెండు నెలల క్రితం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బెంగూళూర్‌కు చెందిన టెక్సోఫోర్ట్ కంపెనీ యూనిట్ కూడా అపెరల్ పార్కులో ఉత్పత్తులు ప్రారంభించింది. ఏడెకరాల్లో టెక్సోఫోర్ట్ కంపెనీ యూనిట్ ఏర్పాటు కాగా, ఈ కంపెనీ యూనిట్ ద్వారా రెండు వేల మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మరోవైపు, ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించే దిశగా జూకీ కుట్టుమిషన్లపై శిక్షణ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News