Maha Shivaratri: శివరాత్రికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 26 , 2025 | 03:57 AM
మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బీరంగూడ మల్లికార్జునుడు, ఝరాసంగం సంఘమేశ్వరుడు, షాద్‌నగర్ రామేశ్వరుడు, ఆలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం..
కీసర, యాదగిరిగుట్టల్లో వైభవంగా కల్యాణోత్సవం
కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు
శివ నామస్మరణతో మార్మోగిన రాజరాజేశ్వరాలయం
మల్లెల తీర్థంలో జలపాతాల సందర్శన షురూ
ఈ నెల 28 వరకు అటవీశాఖ అనుమతి
కీసర/మహేశ్వరం, భువనగిరి అర్భన్, సిరిసిల్ల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయం, మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం, యాదగిరిగుట్టపైన శివాలయం, వేములవాడ రాజన్న, బీరంగూడ మల్లికార్జునుడు, ఝరాసంగం సంఘమేశ్వరుడు, షాద్‌నగర్ రామేశ్వరుడు, ఆలంపూర్ నవబ్రహ్మేశ్వరాలయం.. ఇలా ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు, రుద్రయాగాలు, పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాలు ఊపందుకున్నాయి. కీసరగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగం గా మంగళవారం రాత్రి భవానీశివదుర్గ సమేత రామలింగేశ్వర స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వం తరపున చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని, పట్టువస్త్రాలు సమర్పించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. బుధవారం శివరాత్రి సందర్భంగా.. ప్రభుత్వం ఆలయంలో ఏర్పాట్లను పూర్తిచేసింది. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆన్‌లైన్ ద్వారా దర్శనం టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఇతర ముఖ్యులకు ప్రొటోకాల్ లైన్, వీఐపీ పాసులతో మరో లైన్ ఏర్పాటు చేశారు. వీఐపీ క్యూలో వచ్చే భక్తులకు టైం స్లాట్ విధించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. 1,200 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. అటు రంగారెడ్డిజిల్లా శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి-భువనగిరిలోని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో.. పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరుడి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆది దంపతులకు అర్చకులు పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను సమర్పించారు. యాదగిరిగుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఈ సందర్భంగా నాగవల్లి దళార్చనలు, నరసింహస్వామికి నిత్యకల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలోనూ మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. స్వామివారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.
మల్లెల తీర్థం సందర్శనకు అనుమతి
మన్ననూర్: నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని మల్లెలతీర్థం జలపాతాల సందర్శన మంగళవారం ప్రారంభమైంది. 28 వరకు భక్తులు మల్లెలతీర్థాన్ని, అక్కడి మల్లికార్జున సన్నిధిని సందర్శించవచ్చు.