Share News

Transfers: సీఎంవోలో మార్పులు

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:19 AM

ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రికి కార్యదర్శులుగా, పలు శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అధికారులు బదిలీపై వెళ్లనున్నారు.

Transfers: సీఎంవోలో మార్పులు

  • బదిలీపై వెళ్లనున్న ముగ్గురు అధికారులు

  • వారి స్థానంలో ఎవరన్నదానిపై చర్చలు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రికి కార్యదర్శులుగా, పలు శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అధికారులు బదిలీపై వెళ్లనున్నారు. ప్రస్తుతం సీఎం ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రితోపాటు ఐఎ్‌ఫఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఐఏఎ్‌సలు మాణిక్కరాజ్‌, సంగీత సత్యనారాయణ, వేముల శ్రీనివాసులు, ఐపీఎ్‌సలు షానవాజ్‌ ఖాసీం, బి.అజిత్‌రెడ్డి ఉన్నారు. వీరిలో సంగీత సత్యనారాయణ తాజా బదిలీల్లో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వెళ్లారు. సీఎంకు కార్యదర్శిగా, బీసీ, మైనార్టీ సంక్షేమం, ఆర్‌అండ్‌బీ సహా పలు శాఖల బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్‌ అఽధికారి షానవాజ్‌ ఖాసీం కూడా బదిలీపై వెళ్లనున్నట్టు తెలిసింది.


ఈయన బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలోనే వెలువడతాయని సమాచారం. ఆయనను తిరిగి పోలీసు శాఖకే బదిలీ చేస్తారని తెలుస్తోంది. సీఎం కార్యదర్శిగా, అటవీ, పర్యావరణం, వ్యవసాయం, పశుసంవర్థక శాఖ, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఐఎ్‌ఫఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి కూడా త్వరలో బదిలీకానున్నట్టు సచివాలయవర్గాలు చెబుతున్నాయి. సమాచారం హక్కు(ఆర్టీఐ) చట్టం ప్రధాన కమిషనర్‌(సీఐసీ)గా చంద్రశేఖర్‌ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రభుత్వం గవర్నర్‌కు ఫైలును పంపిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొత్తంగా సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు బదిలీపై వెళ్లనున్నారని స్పష్టమవుతుండగా.. వారి స్థానంలో ఎవరిని తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

Updated Date - Apr 28 , 2025 | 04:19 AM