Share News

Seethakka: ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

ABN , Publish Date - May 11 , 2025 | 04:37 AM

సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచించారు.

Seethakka: ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి

  • పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచన

  • సమస్యలను సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్తా.. విడతలవారీగా పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తాం

అబ్దుల్లాపూర్‌మెట్‌/చౌటుప్పల్‌ టౌన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా ప్రజా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క సూచించారు. హైదరాబాద్‌ శివారు పెద్దఅంబర్‌పేట్‌లో శనివారం తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతున్న మాట వాస్తవమేనని అన్నారు. రిజర్వేషన్లలో అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కులగణన చేపట్టిందని తెలిపారు. కార్యదర్శుల సమస్యలపై ఈ నెల 25వ తేదీలోగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెండింగ్‌ బిల్లులను విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.


మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ గ్రామవ్యవస్థను చక్కబెట్టేది పంచాయతీ కార్యదర్శులేనన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు అందరం కలిసికట్టుగా పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువద్దామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మరో మూడేళ్లలో అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడితో కొంతమంది కార్యదర్శులు సొంత డబ్బు వెచ్చించి, మరి కొంతమంది రూ.2-4లక్షల వరకు అప్పుచేసి పనులు చేయించారన్నారు. సంబంధిత బిల్లులు విడుదల కాకపోవడంతో.. వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని మంత్రి సీతక్కను కోరారు.

Updated Date - May 11 , 2025 | 04:37 AM