Secunderabad Railway Station: అక్టోబరు 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:28 AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో ఇతర స్టేషన్లకు మళ్లింపు
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి అదే స్టేషన్ నుంచి రైళ్లు బయలుదేరుతాయని ఓ ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నుంచి వెళ్లే (12713, 12714) రైళ్లు కాచిగూడ స్టేషన్‌కు, పోరుబందర్ నుంచి (వీక్లీ) వచ్చి వెళ్లే (20967, 20968) రైళ్లు ఉందానగర్‌కు, సిద్దిపేట నుంచి వచ్చి వెళ్లే (77656, 77653, 776754, 77655) రైళ్లను మల్కాజ్‌గిరికి మళ్లించినట్టు వివరించారు.
పుణె నుంచి వచ్చి వెళ్లే (12025, 12026) రైళ్లు హైదరాబాద్ స్టేషన్ నుంచి.. మణుగూరు (12745, 12746) రైళ్లు, రేపల్లె నుంచి వచ్చి వెళ్లే (17645, 17646) రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తాయన్నారు.. దూర ప్రాంతాలకు వారానికోసారి, రెండు, మూడు సార్లు నడిచే పలు రైళ్లు.. సిల్చార్ (12513, 12514), దర్భంగ (17007, 17008), యశ్వంత్‌పూర్ (12735, 12736) రైళ్లు చర్లపల్లి నుంచి.. అగర్తల (07029, 07030), ముజఫర్‌పూర్ (05293, 05294), సంత్రాగచి (07221, 07222), దనపూర్ (07647, 07648), రామేశ్వరం (07695, 07696), హైదరాబాద్ రాక్సౌల్ (07051, 07052) రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.