Siddipet: సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:42 AM
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డిపై సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
దళితురాలిని కులం పేరుతో దూషించారని ఫిర్యాదు
జెండా ఆవిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత
నిరసనకారులపై నర్సారెడ్డి కౌంటర్ ఫిర్యాదు
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డిపై సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యకర్త పుట్ల అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సారెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు విజయ్‌కుమార్‌పై చేయి చేసుకోవడంతో కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డీసీసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణకు వచ్చిన నర్సారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు.
జెండా ఆవిష్కరణ ముగించుకుని తిరిగివెళ్తున్న నర్సారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారని, ఆ సమయంలో నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించారని పుట్ల అనసూయ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే సమయంలో, తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని నర్సారెడ్డి కౌంటర్ ఫిర్యాదు చేయగా, నలుగురు కాంగ్రెస్ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.