Sammakka Sagar Project: సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:05 PM
తెలంగాణకు ఛత్తీస్‌గఢ్ గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గఢ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్ సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీ సామర్థ్యంతో ఈ సమ్మక్క సాగర్ డ్యామ్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద కొత్తగా 12,146 ఎకరాలకు నీరు అందుతుంది. వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది.
90 కిలోమీటర్ల టన్నెల్ నెట్‌వర్క్‌తో భారీ ఇంజనీరింగ్ డిజైన్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మూడు పంప్‌హౌసులు, క్రాస్ డ్రెయినేజ్ వర్క్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 73 హెక్టార్ల భూభాగం నీటిమునిగే అవకాశం ఉన్నందున దానికి పరిహారం, పునరావాసం భరించేందుకు తెలంగాణ సిద్ధం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్ సబ్‌మెర్జెన్స్ స్టడీ ఫైండింగ్స్ అమలు చేస్తామని కూడా ఉత్తమ్ తెలియజేశారు. ఎన్ఓసీ జారీకి ముందే అడ్వాన్స్ చెల్లింపులు ఇవ్వడానికి కూడా తెలంగాణ సిద్ధమవడంతో ఇది సాకారమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే
సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
Read Latest Telangana News And Telugu News