రైతువేదికల నిర్వహణకు నిధులేవి?
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:04 AM
రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వహణకు ప్రభుత్వం గత 30 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తీర్ణాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
30 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వం
కనీస సదుపాయాలు లేక రైతులకు ఇబ్బందులు
కొన్ని చోట్ల సొంతడబ్బుతో నిర్వహిస్తున్న అధికార్లు
రాష్ట్రవ్యాప్తంగా 2,600 రైతువేదికలు పేరుకుపోయిన కరెంటు బిల్లుల బకాయిలు
పెద్దపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వహణకు ప్రభుత్వం గత 30 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తీర్ణాధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేకపోవటంతో రైతు వేదికలకు వచ్చే రైతులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. కొందరు అధికారులు తమ సొంత డబ్బులతో రైతువేదికలను నిర్వహిస్తున్నారు. రెండున్నరేళ్లుగా విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో.. విద్యుత్ కనెక్షన్లను కట్ చేస్తారేమో అన్న ఆందోళన నెలకొంది.
ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు
నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతు వేదికలను నిర్మించింది. పంటల సాగుపై రైతులకు సూచనలు, సలహాలు, శిక్షణ తరగతుల నిర్వహణ, నూతన వంగడాలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించటం తదితర లక్ష్యాల కోసం వీటిని నెలకొల్పారు. పంటలకు లభించే ధరల విషయమై రైతులు కూర్చొని చర్చించుకునేందుకు, సంఘటితం అయ్యేందుకు ఒక వేదికగా ఇవి తోడ్పడతాయని ప్రభుత్వం భావించింది. ప్రతీ 5 వేల మంది రైతులకు, రెండు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి.. ఆ క్లస్టర్‌లో ఒక రైతు వేదికను నిర్మించాలని ప్రతిపాదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాలో నిర్మించేందుకుగాను ఒక్కో రైతు వేదికకు రూ.22 లక్షల వ్యయంతో అంచనాలు రూపొందించారు. వ్యవసాయశాఖ ద్వారా రూ.12 లక్షలు, గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రూ.10 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 2,600 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించారు. ఉదాహరణకు, పెద్దపల్లి జిల్లాలో 54 క్లస్టర్లు ఉండగా 54 రైతువేదికల నిర్మాణం జరిగింది. 2020 ఏప్రిల్, మే నెలల్లో పనులు మొదలుపెట్టి యుద్ధప్రాతిపాదికన డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేశారు. 2021 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. చాలా గ్రామాల్లో రైతు వేదికలను గ్రామాలకు దూరంగా నిర్మించారు. ప్రతీ క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తీర్ణాధికారిని (ఏఈఓను) నియమించారు. ఉదయం 9 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. పంటల సాగుపై శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయితే, రైతు వేదికల నిర్వహణకు గత ప్రభుత్వం హయాం నుంచీ తగిన నిధులను కేటాయించకపోవటంతో వాటి నిర్వహణ సమస్యగా మారింది.
కనీస సదుపాయాలు కరవు
చాలా రైతు వేదికల్లో మంచినీటి సదుపాయం లేదు. వేదికను శుభ్రంగా ఉంచటానికి వీలుగా స్వీపర్లను నియమించలేదు. తాగునీటి సౌకర్యం, విద్యుత్ చార్జీలు, మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు అవసరమవుతాయి. ఆరంభంలో ప్రభుత్వం నెలకు రూ.3 వేలు కేటాయించింది. ఇవి సరిపోవని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7,500 ఇస్తామని, ఆ తర్వాత రూ.9 వేలు ఇస్తామని ప్రకటించింది. మధ్యలో ఆరు నెలలకుగాను బడ్జెట్ విడుదల చేసింది. మొత్తమ్మీద, 2022 ఆగస్టు వరకు నిధులు వచ్చాయి. ఆ తర్వాత నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని భావించారు. కానీ, ఇప్పటి వరకు నిధులు రాలేదని ఏఈఓలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, కొందరు అధికారులు సొంతంగా డబ్బులు పెట్టి కార్యాలయాన్ని శుభ్రం చేయిస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించినప్పుడు తాగునీటిని కూడా సొంతడబ్బులతోనే తెప్పిస్తున్నారు. కాగా, విద్యుత్ బిల్లులు పెండింగులో ఉన్నాయని.. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తే తమ విధులు నిర్వహించటం కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. నిత్యం ఆన్‌లైన్ ద్వారానే పంటలు, రైతులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసి రిపోర్టులు పంపించాల్సి ఉంటుందని.. కరెంటు లేకపోతే అది నిలిచిపోతుందని గుర్తు చేస్తున్నారు. నిధులు లేక రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబ్బులు విడుదల చేయాలని రైతులు, అధికారులు కోరుతున్నారు.