Excise Department: ఎక్సైజ్ కేసుల్లో పెరుగుతున్న శిక్షలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:27 AM
రాష్ట్రంలో ఇటీవల ఎక్సైజ్‌శాఖ నమోదు చేస్తున్న కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గంజాయి, డగ్స్ వంటి మత్తు పదార్థాలకు సంబంధించిన కేసుల్లో అయిదేళ్లు, పదేళ్ల జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ కోర్టులు తీర్పులిస్తున్నాయి.
నేర నిరూపణ కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
సంగారెడ్డి, మెదక్‌లో ఎక్కువ కేసుల్లో శిక్షలు ఖరారు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇటీవల ఎక్సైజ్‌శాఖ నమోదు చేస్తున్న కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా గంజాయి, డగ్స్ వంటి మత్తు పదార్థాలకు సంబంధించిన కేసుల్లో అయిదేళ్లు, పదేళ్ల జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ కోర్టులు తీర్పులిస్తున్నాయి. కేవలం కేసుల నమోదుతో ఆగకుండా వాటిని విజయవంతంగా రుజువు చేయడంలో ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. గతంలో హత్యలు, దొంగతనం కేసుల్లో ఎక్కువ శిక్షలు పడినట్లు వినేవాళ్లం. ఇప్పుడు ఆ కోవలోకి ఎక్సైజ్ కేసులు కూడా చేరడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన తర్వాత పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ నేరాలను అరికట్టడంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 2021లో తీసుకొచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎ్‌స) చట్టంపై ఎక్సైజ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పోలీసు అకాడమీలో ఎక్సైజ్‌శాఖలో కానిస్టేబుల్ నుంచి అన్నిస్థాయిల్లో దాదాపు 1190 మంది సిబ్బందికి ఈ చట్టం గురించి, ఛార్జిషీట్, పంచనామా తయారీపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఎక్సైజ్ యంత్రాంగం గంజాయి, డ్రగ్స్, అల్పోజోలం లాంటి మత్తు పదార్థాల కేసుల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్సైజ్ కేసుల్లో శిక్షలు పడుతున్నాయి.
కేసుల నమోదు.. శిక్షల గణాంకాలు ఇలా..
రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్సైజ్ కేసుల్లో తొలి జైలు శిక్ష మెదక్‌లో నమోదైంది. గత రెండేళ్లలో పదుల సంఖ్యలో నిందితులకు అయిదేళ్లు, పదేళ్ల శిక్షలు పడ్డాయి. రాష్ట్రంలో ఎన్‌డీపీఎ్‌స చట్టం కింద 2023లో 16 మంది, 2024లో 11 మంది, 2025లో గత నెల వరకు 15 మంది నిందితులకు శిక్షలు పడ్డాయి. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 64మందికి ఎక్సైజ్ కేసుల్లో శిక్షలు పడ్డాయి. రాష్ట్రంలో ఈ కేసుల్లో ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాలో 23, మెదక్‌లో 10, కొత్తగూడెం జిల్లాలో 6, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మేడ్చల్ మల్కజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ముగ్గురి చొప్పున, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఇద్దరి చొప్పున శిక్షలు పడ్డాయి. కేసులు నమోదు చేసేటప్పుడు నిబంధనలు పాటించడం వల్ల నేర నిరూపణ సులభమైందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News