Share News

Revenue Officers: రెవెన్యూ అధికారుల పల్లె బాట

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:46 AM

పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు మళ్లీ గ్రామాల్లోకి వెళ్లి భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిన భూమి సమస్యలకు ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Revenue Officers: రెవెన్యూ అధికారుల పల్లె బాట

పుష్కర కాలం తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

భూభారతి అమలులో భాగంగా 621 మండలాల్లో సభలు

జూన్‌ 20 వరకు ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపేలా చర్యలు

హైదరాబాద్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు మళ్లీ గ్రామాల బాట పట్టారు. భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2012-13లో అప్పటి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ సదస్సులు జరిగాయి. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి సదస్సులు నిర్వహించింది లేదు. ‘ధరణి’ అమలులోకి తెచ్చిన సమయంలో 2022లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రతిపాదించినా అది కార్యరూపం దాల్చలేదు. 2017లో భూరికార్డుల ప్రక్షాళన పేరుతో 1బి రికార్డులో ఉన్న హక్కుదారులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారే తప్ప భూసమస్యలకు పరిష్కారం చూపేలా సదస్సులు పెట్టలేదు. ఇప్పుడు భూభారతి చట్టంఅమల్లో భాగంగా మళ్లీ ఇన్నేళ్లకు రెవెన్యూ అధికారులు గ్రామాల బాట పట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 621 మండలాలు ఉన్నాయి. 10,954 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 32 మండలాల పరిధిలో ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సు లు నిర్వహించారు. మిగిలిన మండలాల్లో జూన్‌ 20 తేదీ వరకు సదస్సులు నిర్వహించి ప్రజలు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.


కేటగిరీ వారీగా దరఖాస్తుల స్వీకరణ

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్న వాటిని మినహాయించి మిగిలిన భూవివాదాలకు ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపాలని ప్రభుత్వం అనుకుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కేటగిరీల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 76 కేటగిరీలుగా సమస్యలను విభజించారు. ధరణి అమలులోకి వచ్చిన సమయంలో సిద్దిపేట జిల్లా ములుగులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కలెక్టర్‌, ఇతర రెవెన్యూ సిబ్బంది 15 రోజుల పాటు భూ సమస్యలపై అధ్యయనం చేశారు. సుమారు 270 సమస్యలు దృష్టికి రాగా అందులో 70 సమస్యలకు ధరణిలో పరిష్కార మార్గాలు లేవని గుర్తించారు. అలాంటి ఇబ్బందికి తావులేకుండా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం చూపాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. అయితే సాంకేతికంగా జఠిలంగా ఉన్న భూసమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామా దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. వీటిపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. కోర్టు అనుమతించిన తర్వాత.. పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. కాగా, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై 2008లో ప్రభుత్వం రెండు ఉత్తర్వులు ఇచ్చింది. వాటి ప్రకారం.. తమ దృష్టికి వచ్చిన భూసమస్యల్లో 50 శాతం సమస్యలను తహసీల్దార్‌ స్థాయి అధికారి క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించాలి. ఆర్డీవో స్థాయి అధికారి 25 శాతం సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఇప్పుడు ఇదే విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:46 AM