Share News

CM Revanth Reddy: గెలుపు సునాయాసం

ABN , Publish Date - Nov 03 , 2025 | 04:05 AM

జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు సునాయాసమేనని, అయినా సరే ఏమాత్రం అలసత్వం చూపవద్దని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు....

CM Revanth Reddy: గెలుపు సునాయాసం

  • అయినా ఏమాత్రం అలసత్వం వద్దు

  • పెయిడ్‌ సర్వేలతో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలు.. వాటిని తిప్పికొట్టండి

  • కాంగ్రెస్‌ సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి వివరించండి

  • ‘జూబ్లీహిల్స్‌’ గెలుపు ప్రభుత్వానికి, మంత్రులకూ కీలకమే

  • మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టండి

  • ఎవరి పనితీరు ఎలా ఉందన్నది అధిష్ఠానం చూస్తోంది.. మంత్రులతో సీఎం

  • వంద ఓట్లకొక బూత్‌ స్థాయి ఏజెంట్‌ను పెట్టాలని రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

  • ప్రచార సమన్వయం కోసం కో-ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు సునాయాసమేనని, అయినా సరే ఏమాత్రం అలసత్వం చూపవద్దని మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలు, పెయిడ్‌ సర్వేలను ప్రజల్లోకి తీసుకెళుతోందని, వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని దిశానిర్దేశం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఓటరు దృష్టికీ తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ఎన్నిక ప్రభుత్వానికి, మంత్రులకు కూడా కీలకమేనని స్పష్టం చేశారు. అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో మంత్రులతో విందు సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ప్రచారం, ఇతర కార్యక్రమాలపై సీఎం సమీక్ష జరిపారు. ఆయా డివిజన్లలో ఇన్‌చార్జి మంత్రుల పనితీరు బాగానే ఉందని, పార్టీ విజయం కూడా సునాయాసమేనని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.


ఉప ఎన్నిక ప్రభుత్వానికి చాలా కీలకమని, మంత్రులంతా సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఎవరి పనితీరు ఎలా ఉందన్నది అధిష్ఠానం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, పెయిడ్‌ సర్వేలను వినియోగించుకుంటోందని రేవంత్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకుని తప్పుడు సమాచారాన్ని జనంలోకి తీసుకెళుతోందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆ తప్పుడు ప్రచారాలను, తప్పుడు సర్వేలను మంత్రులు బలంగా తిప్పి కొట్టాలని సూచించారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని.. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక బూత్‌ స్థాయి ఏజెంట్‌ను పెట్టి, పర్యవేక్షించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఇక ఈ ఉప ఎన్నికను సీరియ్‌సగా తీసుకుని పనిచేయాలని మంత్రులకు మీనాక్షి నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ సూచించారు. ఇక కొత్తమంత్రి అజారుద్దీన్‌కు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి మంత్రులు అభినందనలు తెలిపారు.

ప్రచారంపై సమన్వయ కమిటీ ఏర్పాటు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని సమన్వయం చేసుకునేందుకు కో-ఆర్డినేషన్‌ కమిటీని నియమించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ కో-చైర్మన్‌గా, మరో 14 మంది సభ్యులతో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 03 , 2025 | 04:05 AM