CM Revanth Reddy: సీఎంతో మీనాక్షి భేటీ
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:42 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మీనాక్షి కలిశారు.
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కమిటీ నియామకంపై ప్రధానంగా చర్చ
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మీనాక్షి కలిశారు. సుమారు గంటకు పైగా వారు చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు దారితీసింది. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన కమిటీల నియామకం చర్చకు రాగా.. పార్టీ నేతల మధ్య కొరవడిన సమన్వయం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలనూ మీనాక్షి చర్చలో ప్రస్తావించినట్లు తెలిసింది. వారం పది రోజులుగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో జరిపిన సమీక్షల్లో వెల్లడైన అంశాలను మీనాక్షి ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం.
పార్టీలో అంతర్గత విభేదాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై వారు చర్చించినట్లు తెలిసింది. పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకోని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై వచ్చిన ఫిర్యాదులను మీనాక్షి సీఎంకు వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చేసిన ఫిర్యాదు ప్రస్తావించినట్టు తెలిసింది. అలాగే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతల మధ్య సమన్వయ లోపమే కారణమని మీనాక్షి తెలిపినట్లు సమాచారం. నియోజకవర్గాల నేతలు సోషల్‌మీడియాను వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నారని.. ఇతర పార్టీల్లో మాదిరిగా కాంగ్రెస్‌నేతలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని మీనాక్షి వివరించినట్లు సమాచా రం. ఈ సందర్భంగా ఆయా అంశాలపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీనిచ్చినట్టు తెలిసింది.