Share News

CM Revanth Reddy accused KTR and Kishan Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ బ్యాడ్‌ బ్రదర్స్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 03:11 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌ పాలిట బ్యాడ్‌ బ్రదర్స్‌గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫ్యూచర్‌ సిటీని ఈ బ్యాడ్‌ బ్రదర్స్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు....

CM Revanth Reddy accused KTR and Kishan Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ బ్యాడ్‌ బ్రదర్స్‌

  • హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

  • నగరాభివృద్ధికి మోదీ, కేసీఆర్‌ చేసిందేంటి?

  • ప్రగతిభవన్‌, సచివాలయం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా?

  • ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

  • నగర విస్తరణకు రూ.వేలాది కోట్లతో ప్రణాళికలు

  • ఏ ఎన్నికనైనా ప్రతిష్ఠాత్మకంగానే తీసుకొంటాను

  • టీడీపీ అభిమానులు బీఆర్‌ఎ్‌సకు ఓటువేస్తారనుకోను

  • చంద్రబాబును అరెస్టు చేస్తే నిరసనలూ వద్దన్నారు

  • బీజేపీకి డిపాజిట్‌ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్‌ అంగీకరిస్తారా?: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌ పాలిట బ్యాడ్‌ బ్రదర్స్‌గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మెట్రోరైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫ్యూచర్‌ సిటీని ఈ బ్యాడ్‌ బ్రదర్స్‌ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు బ్యాడ్‌ బ్రదర్స్‌తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో కొత్తగా కట్టినవి సచివాలయం, ప్రగతిభవన్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కాళేశ్వరం మాత్రమేనన్నారు. సచివాలయం, ప్రగతి భవన్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లతో నిరుద్యోగులకు కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా ఒక్క ఎకరాకైనా నీరందించారా? అని ప్రశ్నించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ, కేసీఆర్‌ దానిని రద్దు చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పోగొట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌కు గ్రోత్‌ ఇంజన్లలా పని చేస్తూ.. ప్రస్తుతం ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల ఆదాయం రావడానికి కారణమైన ప్రాజెక్టులు, సంస్థలన్నీ గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తీసుకువచ్చినవేనన్నారు. నగర అభివృద్ధి కోసం 2004 నుంచి 2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, 2014 నుంచి 2023 వరకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూసుకుని జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.


8 లక్షల కోట్ల అప్పులు చేశారు..

రూ.69 వేల కోట్ల అప్పులు, రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను కేసీఆర్‌కు అప్పగిస్తే.. పదేళ్ల పాలనలో రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి తమకు అప్పగించారని సీఎం రేవంత్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చిన విమానాశ్రయం, మెట్రోరైలు, నాలెడ్జ్‌ సెంటర్‌, హైటెక్‌ సిటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులు, సంస్థలన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనన్నారు. మోదీ, కేసీఆర్‌, కిషన్‌రెడ్డి, కేటీఆర్‌ చేసిందేంటని ప్రశ్నించారు. వరదల్లో హైదరాబాద్‌ మునిగిపోతే కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి చిల్లిగవ్వ కూడా తేలేదని విమర్శించారు. సచివాలయంలో దేవాలయాన్ని, మసీదును కేసీఆర్‌ ప్రభుత్వం కూలగొడితే.. స్థానిక ఎంపీ అయి ఉండీ కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రగతి భవన్‌ కేసీఆర్‌ సేదదీరేందుకు ఉపయోగపడిందని, కొడుకు సీఎం కావడం కోసం వాస్తును సరిదిద్దేందుకు సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌.. సీసీ కెమెరాలతో ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో తనను తాను కాపాడుకునేందుకు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ బాత్రూమ్‌లు కట్టుకున్నారన్నారని, ప్రస్తుతం అందులో నివాసముంటున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఈ విషయాన్ని ధ్రువీకరించారని చెప్పారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ను తొలగిస్తే ఎక్కువ ఖర్చవుతుందని అలాగే ఉంచామన్నారు. ఇక ఢిల్లీలోని సీఎం నివాసాన్నీ బుల్లెట్‌ ప్రూఫ్‌ చేశారని, ఢిల్లీ వెళ్లినప్పుడు అందులోనే ఉంటున్న తానే దానికి సాక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పల్లీ బఠానీలకు అమ్మేసుకుందని ధ్వజమెత్తారు. పదేళ్లలో రూ.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలన్నారు.


వేలాది కోట్లతో ప్రణాళికలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌ పోర్టుల నిర్మాణానికి అనుమతులు తెచ్చిందని సీఎం రేవంత్‌ తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క రైల్వే ప్రాజెక్టును, డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టునైనా తెచ్చిందా? అని ప్రశ్నించారు. డ్రైపోర్టు ఏర్పాటు కోసం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నామని, ఎలీ లిల్లీ లాంటి కంపెనీ బిలియన్‌ డాలర్ల ఫార్మాలో పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు పార్లమెంటు ఎన్నికల కోడ్‌తోనే గడిచిందని, మిగిలిన ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. నగర విస్తరణకు రూ.వేలాది కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని కేటీఆర్‌ డ్రగ్స్‌కు, గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ‘‘ కేటీఆర్‌ సన్నిహితుడు కేదార్‌.. అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని చనిపోలేదా? కేటీఆర్‌ బావమరిది ఇంట్లో జరిగిన పార్టీలో కొకైన్‌ తీసుకున్నవారు దొరికింది నిజం కాదా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరమన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేల సహకారంతో మెట్రో, అండర్‌ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేటీఆర్‌కు లొంగిపోయి కిషన్‌రెడ్డి మూసీ ప్రక్షాళననూ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో నగరంలోని 695 చెరువుల్లో 44 చెరువులను బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేశారని, మరో 127 చెరువులను పాక్షికంగా ఆక్రమించారని సీఎం తెలిపారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించి పునరుద్ధరిస్తున్నందునే హైడ్రాపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్నది బీఆర్‌ఎస్‌ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. గతంలో చిన్న వర్షానికే హైదరాబాద్‌ మునిగిపోయేదని, హైడ్రాతో ఆక్రమణలను తొలగించినందునే ఇటీవల పడ్డ పెద్ద వర్షాలకు నగరం జలమయం కాలేదని అన్నారు.


హైడ్రాను బంద్‌ చేయాలని చూస్తున్న కేటీఆర్‌..

హైడ్రాను, డ్రగ్స్‌ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్‌ ఫోర్స్‌లను బంద్‌ పెట్టించాలని కేటీఆర్‌ కంకణం కట్టుకున్నారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. నగరంలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడిందని తెలిపారు. హైడ్రా, ఈగల్‌ ఫోర్స్‌లపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకూ తాము సిద్ధంగా ఉన్నామని, హైడ్రాలో ఏమైనా లోపాలున్నట్లు చూపిస్తే సరిదిద్దుకుంటామన్నారు. పీఎ్‌సయూలను అమ్ముకునే అలవాటున్న బీజేపీ.. తాము ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రోను వాల్చుకుంటామని ఊహించి ఉండదన్నారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకు సాధించి పెట్టామని తెలిపారు. ఎల్‌ అండ్‌ టీ కంపెనీని బ్లాక్‌ మెయిల్‌ చేసి.. మెట్రో దివాళా తీయడానికి కారకులు కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. సినీ కార్మికుల సంక్షేమం గురించి కేటీఆర్‌ ఎప్పుడైనా ఆలోచించారా? అని నిలదీశారు. సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వాలని, భవిష్యత్తులో ఇక్కడ హాలీవుడ్‌ షూటింగ్‌లూ జరిగే స్థాయికి నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

ముస్లిం టోపీని మోదీ ఎందుకు పెట్టుకున్నారు?

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ.. తలపైన ముస్లింలు ధరించే టోపీ ఎందుకు పెట్టుకున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెప్పాలని సీఎం రేవంత్‌ అన్నారు. తాను ఆచరించేది హిందూమతమని, ఇతర మతాలనూ తాను గౌరవిస్తానని తెలిపారు. ఒక సీఎంగా అన్ని మతాలను సమానంగా చూడడం తన బాధ్యత అని చెప్పారు. వివిధ కార్యక్రమాల్లో ముస్లిం టోపీలు ధరించిన బీజేపీ నేతల టోపీలను బండి సంజయ్‌కి పంపుతానని, ఎందుకు పెట్టుకున్నారో వారిని అడగాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్లు రాకుంటే.. దానిని రిఫరెండంగా తీసుకుని హిందువులు బీజేపీతో లేరని బండి సంజయ్‌ భావిస్తారా? అని ప్రశ్నించారు. ప్రచార సభలకు అనుమతి ఇచ్చేది ఎన్నికల కమిషన్‌ అని, ఈ విషయంలో బండి సంజయ్‌కి సమస్య ఉంటే వారితో మాట్లాడుకోవాలని సూచించారు. మాగంటి గోపీనాథ్‌ మృతిపై బండి సంజయ్‌కి అనుమానాలుంటే డీజీపీకిగానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. గోపీనాథ్‌ తల్లి కూడా కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అయితే గోపీనాథ్‌ మరణంపై మాట్లాడి తాను వివాదం చేయదల్చుకోలేదన్నారు. తాను సచివాలయానికి రావడంలేదని హరీశ్‌రావు అంటున్నారని, ఆయన మాట్లాడేటప్పుడు అద్దంలో చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తన క్యాంపు కార్యాలయంగా వాడుకుంటున్నానని, సచివాలయంలోనూ చేయాల్సినవి చేస్తున్నామని తెలిపారు.


నేను కాంగ్రెస్‌ కార్యకర్తను

ముఖ్యమంత్రి కన్నా ముందు తాను కాంగ్రెస్‌ కార్యకర్తనని, ఏ ఎన్నికనైనా ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటానని సీఎం రేవంత్‌ అన్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. ఉప ఎన్నికలో కనీసం ఓటు వేయాలని అడగకుండా ఫామ్‌హౌ్‌సలో పడుకున్న కేసీఆర్‌.. బాధ్యతా రహితంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. సర్వేల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, డబ్బులిచ్చినవారు ఏ పాట పాడమంటే అవి ఆ పాట పాడతాయని వ్యాఖ్యానించారు. కేసీఆరే బయటికి రానప్పుడు ఇక తమకు పోటీ ఎక్కడిదన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్‌లో నిరసనలు తెలిపే అవకాశం కూడా ఇవ్వని, ఎన్టీఆర్‌ ఘాట్‌ను లేకుండా చేయాలని చూసిన బీఆర్‌ఎ్‌సకు ఇక్కడి టీడీపీ అభిమానులు ఓటు వేస్తారని తాను అనుకోవట్లేదన్నారు.

కవితను బయటకి పంపేలా చేసిందే హరీశ్‌రావు

జగ్గారెడ్డి మొదలుకుని ఈటల రాజేందర్‌ వరకు కేసీఆర్‌కు నమ్మకమైన వారందరినీ హరీశ్‌రావు బయటికి పంపేశాడని సీఎం రేవంత్‌ ఆరోపించారు. చివరికి ఇంట్లోని కవితనూ బయటికి పంపేలా చేశారన్నారు. ఇక మిగిలి ఉన్న వారిలో కేసీఆర్‌కు ఆరోగ్యం బాగా లేదని, కేటీఆర్‌ ఒక సోంబేరి అని అన్నారు. పార్టీని ఆక్రమించడానికి హరీశ్‌రావుకు ఇక మిగిలి ఉంది ఒక్క అడుగేనన్నారు. వీరు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతారా? అని వ్యాఖ్యానించారు. విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్‌ ప్రజలు ఆలోచనతో ఓటు వేసి ఒక్కసారి కాంగ్రె్‌సకు అవకాశం ఇవ్వాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ కనిపిస్తే తొక్కి నార తీస్తామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో మూడు నెలల వరకూ శిక్షలు పడుతుంటే.. డ్రగ్స్‌ సేవించి దొరికినవారు మాత్రం స్టేషన్‌ బెయిల్‌తో బయటికి వచ్చేలా చట్టాలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో అవినీతికి పాల్పడిన వారిని లాక్‌పలో వేస్తామని కిషన్‌రెడ్డి అన్నారని, కానీ.. సెప్టెంబరు 15న అప్పగించినా కేసీఆర్‌, హరీశ్‌రావుపై ఇంతవరకు విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ రౌడీ అని మాట్లాడుతున్నారని, పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతాడా? అని ప్రశ్నించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి కడుపు మంట ఎందుకన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 06:31 AM