నాగారంలో రెండిళ్లు దగ్ధం
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:13 AM
ప్రమాదవశాత్తు రెండు ఇళ్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని నాగారంలో శుక్రవారం జరిగింది.
ధారూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు రెండు ఇళ్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని నాగారంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మున్నూర్ అశోక్, పాల్గుణలు అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరుగా కాపురం చేస్తున్నారు. కాగా వీరు ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించింది. ముందుగా అశోక్ ఇంటికి నిప్పంటుకుని పాల్గుణ ఇంటికి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అశోక్ ఇళ్లు పూర్తిగా దగ్ధమై దాదాపు రూ.3లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లో ఉన్న పది క్వింటాళ్ల పత్తి, రూ.50వేలు నగదు, దుస్తులు, బియ్యం, బీరువాలో ఉన్న విలువైన వస్తువులు పూర్తి దగ్ధమయ్యాయి. అదేవిధంగా పాల్గుణ ఇంటికి మంటలు వ్యాపించి బియ్యం, జొన్న బస్తాలు, యూరియాబస్తాలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. పంచాయతీ నీటి ట్యాంకర్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులను ధారూరు పీఏసీఎస్ చైర్మన్ వై.సత్యనారాయణ రెడ్డి పరామర్శించారు.