రెండు కార్లు ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:58 PM
గూడూరు గేటు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన శనివారం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

కందుకూరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): గూడూరు గేటు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన శనివారం కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కసిరెడ్డి విశాంత్‌రెడ్డి కారులో చంద్రయానంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా గూడూరు గేటు వద్ద ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దాంతో విశాంత్‌రెడ్డి కుడికాలు, కుడి భుజానికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు కర్మాన్‌ఘాట్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీతారాం చెప్పారు.
అంబులెన్స్ ఢీకొనడంతో మరొకరికి..
ఆమనగల్లు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి విటాయపల్లి వద్ద శ్రీశైలం-హైదరాబాద్ ఎన్‌హెచ్‌పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. పోలేపల్లికి చెందిన శిరగని లాలయ్య స్థానిక సూర్యలక్ష్మి కాటన్‌మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. విటాయపల్లిగేటు వద్ద ఉదయం టీ తాగడానికి వెళ్లి రోడ్డు పక్కన నిల్చున్నాడు. ఈక్రమంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్ వాహనం లాలయ్యను ఢీకొట్టింది. దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.