రంగారెడ్డి జిల్లా ఓటర్ల సంఖ్య 36,63,152
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:56 PM
జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ 2025 ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం సవరించిన ఓటరు తుది జాబితాను సోమవారం విడుదల చేసింది.

ఓటరు తుది జాబితా విడుదల
ముసాయిదా తర్వాత
పెరిగిన ఓటర్లు 10,706
మహిళలు 18,84,092
పురుషులు17,78,627
ఇతరులు 433
మహిళా ఓటర్లు అధికం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల తోపాటు బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. ఇటీవల ఎన్నికల గుర్తులు కూడా ఖరారు చేశారు. తాజాగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 36,63,152 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో మహిళలే అధికంగా ఉన్నారు. అక్టోబరు 29న ప్రకటించిన ముసాయిదా ప్రకారం పోలిస్తే సవరించిన జాబితాలో 10,706 మంది ఓటర్లు పెరిగారు.
రంగారెడ్డి అర్బన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ 2025 ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం సవరించిన ఓటరు తుది జాబితాను సోమవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 36,63,152 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 18,84,092 మంది, మహిళలు 17,78,627 మంది, ఇతరులు 433 మంది ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 361 ఉండగా, మొత్తం సర్వీసు ఓటర్లు 615 మంది ఉన్నారు. అక్టోబరు 29న ప్రకటించిన ముసాయిదా ప్రకారం జిల్లాలో 36,52,446 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే జిల్లాలో 10,706 మంది ఓటర్లు పెరిగారు. నూతన ఓటరు జాబితా తయారీలో భాగంగా 2024 ఆగస్టు 20 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు బీఎల్వోలు ఇంటింటా సర్వే నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్త ఓటర్ల నమోదుతో పాటు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేపట్టారు. అక్టోబరు 29న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించారు. నవంబరు 9, 10వ తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆన్‌లైన్‌లో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, మార్పులు, చేర్పులు, మృతుల పేర్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గాల మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. 2025 జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలోని 3,501 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 36,63,152 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.
అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లిలోనే..
జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లిలోనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 7,66,036 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,04,203 మంది పురుషులు, 3,61,689 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఇతరులు కూడా అధికంగానే ఉన్నారు. 1,434మంది ఇతర ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,43,317 మంది ఓటర్లు ఉన్నారు.
షాద్‌నగర్‌లో మహిళా ఓటర్లే అధికం
జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పురుషుల ఓటర్లే అధికంగా ఉన్నారు. కానీ.. షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 268 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం పురుషుల ఓటర్లు 1,21,326 ఉండగా.. మహిళా ఓటర్లు 1,21,978 ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 652 మంది అధికంగా ఉన్నారు.