Share News

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కుటుంబం బలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:23 AM

టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టిప్పర్‌ లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. తన కళ్లముందే తన భార్య, బిడ్డను పోగొట్టుకున్న క్షతగాత్రుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూతుళ్లను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి కుటుంబం బలి

స్కూటీని ఢీకొట్టిన టిప్పర్‌

తల్లీకూతురు దుర్మరణం, తండ్రికి తీవ్ర గాయాలు

పహాడిషరీఫ్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టిప్పర్‌ లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. తన కళ్లముందే తన భార్య, బిడ్డను పోగొట్టుకున్న క్షతగాత్రుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూతుళ్లను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం ఎల్లికల్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ తన ద్విచక్ర వాహనంపై కూతురుకు ఎర్రరక్త కణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం భార్య లక్ష్మమ్మ(32), కూతురు విజయ(14)తో కలిసి కల్వకుర్తి నుంచి బైక్‌పై ఉస్మానియా ఆస్పత్రికి వెళుతుండగా తుక్కుగూడ అవుటర్‌ రింగ్‌ రోడ్డు బ్రిడ్జి వద్దకు రాగానే అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా.. వాహనం నడుపుతున్న గోపాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గోపాల్‌ను ఆసుపత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:23 AM