Share News

భూగర్భం.. గరళం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:19 PM

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగునీటిలో పరిమితికి మించి ఫ్లోరైడ్‌, రసాయన అవశేషాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర భూగర్భ జల మండలి(సీజీడబ్ల్యూబీ) తాజాగా విడుదల చేసిన వార్షిక భూగర్భజలాల నాణ్యత నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి

భూగర్భం.. గరళం

ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న ఫ్లోరైడ్‌ భూతం

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రసాయన అవశేషాలు

రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అధికంగా నత్రజని

పరిమితికి మించి రసాయన అవశేషాలు

వికారాబాద్‌ జిల్లాలో 100 శాతం సురక్షితం

కేంద్ర భూగర్భ జలమండలి తాజా నివేదికలో వెల్లడి

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగు, సాగునీటిలో పరిమితికి మించి ఫ్లోరైడ్‌, రసాయన అవశేషాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర భూగర్భ జల మండలి(సీజీడబ్ల్యూబీ) తాజాగా విడుదల చేసిన వార్షిక భూగర్భజలాల నాణ్యత నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పలు ప్రాంతాల్లో తాగు, సాగునీరు అంత సురక్షితం కాదని పరీక్షల్లో తేలింది. అనేక మండలాల్లో ఫ్లోరైడ్‌ విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అలాగే నీటిలో నత్రజని శాతం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. దేశంలోనే అత్యధిక నత్రజని (నీటిలో) ఉన్న 16 జిల్లాలను ప్రకటించగా ఇందులో రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో ఉన్నట్లు నివేదికలో పేర్కొవడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లాలో 70 నీటి నమూనాలు తీసుకుని పరీక్షించగా అందులో 44 చోట్ల నత్రజని అధికంగా ఉన్నట్లు తేలింది. అంటే సగటు 62.86 శాతం నీటిలో నత్రజని శాతం పరిమితికి మించి ఉంది. నత్రజని ఆధారిత ఎరువులు, జంతు వ్యర్థాలను ఎక్కువగా వినియోగించే ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. తాజా నివేదికలో పెరుగుతున్న జల కాలుష్యం, దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ పరిమితికి మించి క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది సురక్షిత భూగర్భజలాలు ఉన్న పలు మండలాల్లో భూగర్భజలం ప్రమాదకరంగా మారింది. రుతుపవనాలకు ముందు సేకరించిన నీటి నమూనాల్లో కంటే వర్షాలు పడిన తర్వాత తీసుకున్న వాటిల్లో ఫ్లోరైడ్‌ శాతం తక్కువగా ఉండడం గమనార్హం.

బోరు నీటితో జాగ్రత్త తప్పనిసరి

వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో సోడియం కార్బోనేట్‌ అధిక శాతం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 27 చోట్ల నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించగా ఇందులో 16 చోట్ల అంటే 59.26 శాతం తాగునీరు సురక్షితమని తేలింది. మిగతా చోట్ల భూగర్భజలాలు అంత సురక్షితం కాదని వెల్లడైంది. ఇందులో 14.81 శాతం నమూనాల్లో భూగర్భజలం అత్యంత ప్రమాదకరంగా ఉందని తేలింది. ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక శాతం ప్రజలు ప్రభుత్వం సరఫరా చేస్తున్న శుద్ధ జలాలు, ఆర్వో ప్లాంట్ల నీటిని తాగుతున్నప్పటికీ ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో బోరు నీటిని తాగేందుకు ఉపయోగిస్తున్నారు. బోరు నీటిని తాగే ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకర జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది.

ఎంత దాటితే ప్రమాదకరం?

వాస్తవానికి లీటరు జలంలో 1.50 మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరైడ్‌ ఉంటే ఈ నీరు సురక్షితం కాదు. అలాగే 45 మిల్లీ గ్రాములకు మించి నత్రజని, 1.50 మిల్లీ గ్రాములకు మించి సోడియం కార్బొనేట్‌ ఉంటే పరిమితికి మించి ఉంటే ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఉమ్మడి జిల్లాల్లో పలు చోట్ల సేకరించిన నమూనాల్లో ఫ్లోరైడ్‌, నైట్రేట్‌, సోడియం కార్బోనేట్‌ పరిమితికి మించి పరీక్షల్లో తేలింది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ పెరుగుతోంది. ఈ నీరు తాగిన వారు ఫ్లోరోసిస్‌ వ్యాధికి గురవుతుంటారు. అలాగే భూగర్భజలాల్లో నత్రజని అధిక శాతంలో ఉండడం వల్ల కూడా ఆ నీరు సురక్షితం కాదు. పంటల సాగులో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతుండడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జిల్లాల్లో సేకరించిన నమూనాల్లో పలు చోట్ల సోడియం కార్బోనేట్‌ పరిమితికి మించి ఉన్నట్లు తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.

ఫ్లోరైడ్‌ మండలాలు

రంగారెడ్డి జిల్లా : మంచాల, యాచారం, ఆమనగల్‌, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు.

మేడ్చల్‌ జిల్లా : బాచుపల్లి, బాలానగర్‌, దుండిగల్‌, ఘట్‌కేసర్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌

ప్రమాదంలో ఈ మండలాలు

రాజేంద్రనగర్‌, చౌదరిగూడెం, హయత్‌నగర్‌, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌, ఆల్వాల్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, మూడు చింతలపల్లి, కీసర, మల్కాజిగిరి, బాచుపల్లి మండలాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే భూగర్భజలాల విషయంలో వికారాబాద్‌ జిల్లా అత్యంత సురక్షితంగా తేలింది. ఇక్కడ 100 శాతం తాగునీరు సురక్షితమని నివేదికలో వెల్లడైంది.

Updated Date - Jan 08 , 2025 | 12:04 AM