Share News

ఆలయాలు ముస్తాబు

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:42 PM

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి

ఆలయాలు ముస్తాబు
మేడ్చల్‌: అత్వెల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో లక్ష పూజార్చనకు ఏర్పాట్లు

మేడ్చల్‌ ప్రతినిధి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు జిల్లాలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. శుక్రవారం(నేడు) తెల్లవారుజాము నుంచే పలు ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అత్వెల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, జయదర్శిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అలియాబాద్‌ రత్నాలయం, యంనంపేట రంగనాయకస్వామి ఆలయం, ఎదులాబాద్‌ గోదాదేవి ఆలయాల్లో స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అత్వెల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో లక్ష పూజార్చన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త సుదర్శనచారి పంతులు తెలిపారు.

ఘట్‌కేసర్‌ రూరల్‌: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకోని మండలంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటాపూర్‌లోని తాళ్లకుంట శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఎదులాబాద్‌లోని గోదా సమేత శ్రీ మన్నారు రంగనాయకస్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తుల సౌకర్యార్థం పందిళ్లు, బారికేడ్లు ఏర్పాట్లుచేశారు. ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని ఉదయం 5 గంటల నుంచే దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

తాండూరు రూరల్‌: వైకుంఠ ఏకాదశి నేడు(శుక్రవారం), ముక్కోటి ద్వాదశి రేపు(శనివారం) పురస్కరించుకుని మండలంలోని దస్తగిరిపేట్‌ శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. నేడు ఉదయం 4.30గంటలకు మేల్కోలుపు, 5గంటలకు విశేషపూజ, ఉత్తర ద్వారా దర్శనం, రేపు 4.30గంటలకు సుప్రభాతం, 5గంటలకు విశేష అభిశేకం, పూజ, అలంకారం, హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. స్వామివారి సేవ చేయదలచిన భక్తులు ఉదయం 4.30గంటలకు అందుబాటులో ఉండాలని ఆలయ ధర్మకర్తలు వెంకటాచార్‌ శుక్రవార్‌, రాఘవాచార్‌ శుక్రవార్‌, పురంధరాచార్‌ శుక్రవార్‌లు కోరారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

కొడంగల్‌: పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధనుర్మాస పూజలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధరూరి శ్రీనివాసచార్యులు తిరుప్పావై ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

Updated Date - Jan 09 , 2025 | 11:42 PM