వైద్యం వికటించి పెంపుడు పిల్లి మృతి!
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:38 PM
అర్హత లేకున్నా పెంపుడు పిల్లికి వచ్చీరాని చికిత్స చేశారు. దాంతో వైద్యం వికటించి ఆ పిల్లి మృతిచెందింది. ఈమేరకు సరైన వైద్యం చేయని ప్రభుత్వ పశువైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పిల్లిని పెంచుకున్న మహిళ పోలీ్‌సలకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చేవెళ్లలో చోటుచేసుకుంది.

పశువైద్యులపై బాధితురాలి ఫిర్యాదు
చేవెళ్ల, జనవరి 7(ఆంఽధ్రజ్యోతి): అర్హత లేకున్నా పెంపుడు పిల్లికి వచ్చీరాని చికిత్స చేశారు. దాంతో వైద్యం వికటించి ఆ పిల్లి మృతిచెందింది. ఈమేరకు సరైన వైద్యం చేయని ప్రభుత్వ పశువైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పిల్లిని పెంచుకున్న మహిళ పోలీ్‌సలకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చేవెళ్లలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీ్‌సలు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామానికి చెందిన పౌజీయాబేగం కుటుంబం ఏడాదికాలంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలోని చంద్రారెడ్డినగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. పౌజీయాబేగం ఐదు నెలల వయస్సున్న పిల్లిని పెంచుకుంటోంది. నాలుగైదు రోజుల నుంచి పిల్లి ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. జ్వరం ఉందని మంగళవారం మధ్యాహ్నం చేవెళ్లలోని ప్రభుత్వ పశువైద్యశాలకు పిల్లిని తీసుకెళ్లింది. విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఆఫీస్ సబార్డినేట్ దేవేందర్ నట్టల జ్వరం మందును పిల్లికి ఇచ్చాడు. రెండు గంటల తర్వాత పిల్లి సొల్లు కారుస్తూ వణుకుతోందని పౌజీయాబేగం మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. దాంతో విధుల్లో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ హేమ, గోపి, ఓఎస్ ఖలీల్ ఆ పిల్లికి ఎనిల్ ఇంజక్షన్‌తో పాటు నార్మల్ సెలైన్ ఎక్కించారు. దాంతో పిల్లికి నయమైందని అనుకున్నారు. 2 గంటల తర్వాత పిల్లి మృతిచెందింది. పశువైద్యుల నిర్లక్ష్యంతోనే పిల్లి మృతి చెందిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.