Share News

పంచాయతీ ఎన్నికల సందడి షురూ

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:23 AM

సంవత్సర కాలంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాయకులకు.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకుల ఆశలకు జీవం పోసినట్లయింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

పంచాయతీ ఎన్నికల సందడి షురూ
గొల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం

తగిన ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

ప్రారంభమైన విందులు, వినోదాలు

ఫ్యూచర్‌ సిటీ పరిధిలో సందిగ్ధత!

కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు

అథార్టీ లేదా కార్పొరేషన్‌ ఏర్పాటు : కేఎల్లార్‌

మహేశ్వరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సంవత్సర కాలంగా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాయకులకు.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో గ్రామాల్లోని వివిధ పార్టీల నాయకుల ఆశలకు జీవం పోసినట్లయింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దాంతో ప్రజలే కాకుండా పార్టీల నాయకులూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర ఎన్నికల సంఘం జీపీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే గ్రామాల్లో ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియను అధికారులు సిద్ధం చేశారు. ఈమేరకు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బంది వివరాలను ‘టీపోల్‌’లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల వారిగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా అధికారుల నుంచి సేకరించింది. ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారిగా విభజించి అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను కూడా ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. మండలంలో మొత్తం 30 గ్రామపంచాయతీలు, 260 వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆయా గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చేయాలనే ఆశ ఉన్న వివిధ పార్టీల నాయకులు తమ పంచాయతీ, వార్డుల్లో రిజర్వేషన్‌పై ఆశగా ఎదురు చూస్తున్నారు. పోటీ చేయాలనుకున్న ఆశావహులు రిజర్వేషన్ల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడవచ్చనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు గ్రామాల్లో ఎక్కువ శాతం బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే యువతను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఏమవ్వా బాగున్నావా? ఏం తాత బాగున్నావా? అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీలైన మహేశ్వరం, నాగారం, మన్‌సాన్‌పల్లి, అమీర్‌పేట, పెండ్యాల, దుబ్బచర్ల, తుమ్మలూరు, మాణిక్యమ్మగూడ వంటి గ్రామాల్లో మాత్రం ఓటుకు రూ.5నుంచి 10 వేలు కూడా ఖర్చు చేయడానికి నాయకులు ఇప్పటి నుంచే సమకూర్చుకుంటున్నారు.

ఫ్యూచర్‌సిటీ పరిధిపై సందిగ్ధం

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఎంతో ఆశతో ఉన్న మహేశ్వరం, తుమ్మలూరు, మన్‌సాన్‌పల్లి, సిరిగిరిపురం, మెహబత్‌నగర్‌, ఆకన్‌పల్లి, గట్టుపల్లి, కేసీ తండా, గంగారం, ఉప్పుగడ్డతండా, ఎన్డీతండా నాయకులు అంతే నిరుత్సాహంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ గ్రామాలన్నింటినీ కలుపుకొని మహేశ్వరం కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటవుతుందనే వార్తలు ఆరు నెలలుగా వివిధ పార్టీల నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా మహేశ్వరం, కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలను కలుపుకొని ఫ్యూచర్‌సిటీని ప్రత్యేక అథార్టీ లేదా కార్పొరేషన్‌ చేసే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌ చేసిన ప్రకటన ఆయా మండలాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, అధికారులు మాత్రం దీనిపై ఏమీ మాట్లాడటం లేదు.

Updated Date - Jan 10 , 2025 | 12:23 AM