Share News

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు భూ సర్వే అడ్డగింత

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:17 PM

సమాచారం ఇవ్వకుండా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు భూ సర్వే పనులు ఎలా చేపడతారని రైతులు, వివిధ పార్టీల నాయకులు అధికారులను నిలదీశారు. ఇందుకోసం పోలీసులను ఎందుకు తీసుకొచ్చారని, దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటారా అని మండిపడ్డారు.

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు భూ సర్వే అడ్డగింత
రైతులు, నాయకులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ ముంతాజ్‌

సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడంపై రైతుల ఆగ్రహం

రైతుల భూములు దౌర్జన్యంగా లాక్కుంటారా అని నాయకుల ఆక్రోశం

ఎక్వాయిపల్లిలో సర్వేపై అభ్యంతరం.. నిలిపివేసిన పనులు

నిబంధనల మేరకే సర్వే చేస్తున్నాం: తహసీల్దార్‌ ముంతాజ్‌

ముద్విన్‌, ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామ పంచాయతీల వద్ద ఫామ్‌-సీ నోటిఫికేషన్‌ ప్రతుల ప్రదర్శన

కడ్తాల్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి ): సమాచారం ఇవ్వకుండా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు భూ సర్వే పనులు ఎలా చేపడతారని రైతులు, వివిధ పార్టీల నాయకులు అధికారులను నిలదీశారు. ఇందుకోసం పోలీసులను ఎందుకు తీసుకొచ్చారని, దౌర్జన్యంగా రైతుల భూములు లాక్కుంటారా అని మండిపడ్డారు. రైతుల ఆగ్రహాన్ని చూసిన అధికారులు భూ సర్వే పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. రావిర్యాల ఔటర్‌రింగ్‌ రోడ్డు నుంచి ఫోర్త్‌ సిటీని కలుపుతూ కందుకూరు, కడ్తాల, ఆమనగల్లు మీదుగా నిర్మించతలపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూ సేకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా కడ్తాల , ముద్విన్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలోని 1727 మంది రైతులకు చెందిన 257.43 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రాథమిక నిర్థారణ చేసి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందుకనుగుణంగా ఎక్వాయిపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ ఏజెన్సీ నిర్వాహకులు సర్వే ప్రారంభానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న గ్రామ రైతులు స్థానిక బీఆర్‌ఎస్‌ నేత జోగు వీరయ్యతో కలిసి సర్వే చేపడుతున్న బృందం వద్దకు వెళ్లారు. సమాచారం ఇవ్వకుండ సర్వే ఎలా చేస్తున్నారని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కడ్తాల తహసీల్దార్‌ ముంతాజ్‌, సీఐ శివప్రసాద్‌ ఎక్వాయిపల్లికి చేరుకున్నారు. నిబంధనల మేరకే సర్వే పనులు చేపడుతున్నామని రైతులు, నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కనీసం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నోటిఫికేషన్‌ ప్రదర్శించకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్విన్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఫామ్‌-సీ నోటిఫికేషన్‌ను ప్రదర్శించామని, దిన పత్రికలో కూడా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని తహసీల్దార్‌ వివరించారు. తమకు పూర్తిస్థాయి సమాచారం ఇచ్చాకే భూసర్వే చేపట్టాలని రైతులు, నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామ పంచాయతీల వద్ద భూ సేకరణకు సంబంధించి ఫారం-సీ నోటిఫికేషన్‌ ప్రతులను అధికారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జోగు వీరయ్య, నాయకులు కరుణాకర్‌, జంగం శంకరయ్య, చంద్రయ్య, నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహరెడ్డి, చెన్నయ్య, సుమన్‌, జంగయ్య, బాలగోనినారాయణ, నర్సింహ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలం అన్మా్‌సపల్లిలో భూసర్వే, మార్కింగ్‌ పనులు కొనసాగాయి. సీఐ శివప్రసాద్‌, ఎస్సై వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రోడ్డు నిర్మాణం ఆపాలని వినతి

ఆమనగల్లు , జనవరి 7 (ఆంధ్రజ్యోతి ): సాగు చేసుకుంటున్న పంట పొలాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణం పనులు చేయకుండా నిలిపివేయించాలని ఆమనగల్లు మున్సిపాలిటీ 3వ వార్డు సాకిబండ తండా రైతులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని కోరారు. మంగళవారం ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. పాండు, రాజా, రవిరాథోడ్‌, బాలు, గోపి, నార్య, జైపాల్‌, దేవేందర్‌, మహేశ్‌, మణిపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:17 PM