రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:32 PM
రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, డిసెంబరు చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత అధికారులదేనన్నారు.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, డిసెంబరు చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత అధికారులదేనన్నారు. అదనంగా ఇళ్లు తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ ఆవరణలో శుక్రవారం మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆయన శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల పథకంలో పారిశుద్య కార్మికులకు ప్రాధాన్యతనిస్తామన్నారు. బీఆర్‌ఎస్ డబుల్ బెడ్‌రూం ఇళ్లంటూ తొమ్మిదిన్నరేళ్లలో ఈ ప్రాంతంతో ఏ ఒక్కరికీ ఇళ్లు కేటాయించకుండా మోసం చేసిందని, ప్రజాపాలనలో పేదలకు లబ్ధిచేకూరేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందిరమ్మ కమిటీలు, అధికారులు సమన్వయంతో పథకాన్ని ముందుకు తీసుకుపోతామని, పేద మహిళలకు ఏటా రూ.12వేలు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు.
సేవచేసే వారికే స్థానిక ఎన్నికల్లో అవకాశం
స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో సేవచేసే వారిని గుర్తించి వారికి అవకాశం కల్పిస్తామని రంగారెడ్డి అన్నారు. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఇది చేతల ప్రభుత్వమని పేదలు అభివృద్దిలోకి రావాలనేదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ చాంప్లా నాయక్, డీఈ సీ.హెచ్.సంపత్‌కుమార్, మున్సిపల్ చైర్మన్లు కప్పరి స్రవంతి, మర్రి నిరంజన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, తహసీల్దారు సునీతారెడ్డి, ఎంపీడీవో వెంకటమ్మ, మున్సిపల్ కమిషనర్లు రవీంద్రసాగర్, అమరేందర్‌రెడ్డి, బాలకృష్ణ, ఉప్పరిగూడ, మంచాల ఫ్యాక్స్ చైర్మన్లు, ఏదుల్ల పాండురంగారెడ్డి, హన్మంత్‌రెడ్డి, ఏఈ ఎం.రామచంద్రయ్య, నాయకులు శేఖర్‌గౌడ్, వెంకటేశ్వర్లు, అమృతాసాగర్ పాల్గొన్నారు.